ఏ కారణం వల్లైనా నిర్మాణాలు మొదలుపెట్టలేకపోతే అందుకు కారణాన్ని ప్రజలమీదో లేక ప్రతిపక్షం మీదో నెట్టేయటానికి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందా అన్న అనుమానాలు మొదలయ్యాయి.
అధికారంలోకి వచ్చి మూడేళ్ళవుతున్న సందర్భంగా రాజధాని నిర్మాణంపై చంద్రబాబునాయుడు సరికొత్త డ్రామాకు తెరలేపినట్లు కనబడుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా అమరావతిలోని పరిపాలనా నగరంలోని భవనాల నమూనాలను ఎంఎల్ఏలకు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించటం ఆశ్చర్యం. అధికార, ప్రతిపక్ష శాసనసభ్యులందరికీ కలిపి ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన కారణాలపైనే సర్వత్రా చర్చ మొదలైంది. సింగపూర్ కంపెనీలతో మాస్టర్ ప్లాన్ తయారీపై ఎన్నడూ ఎవ్వరికీ ఏ విషయమూ తెలియనీయకుండా చంద్రబాబు జాగ్రత్తపడిన సంగతి అందరికీ తెలిసిందే.
సింగపూర్ కంపెనీలు ఇచ్చిన డిజైన్లను కూడా మీడియా సమావేశంలో మాత్రమే విడుదల చేసారు. తరువాత జపాన్ కు చెందిన మాకీ సంస్ధ అందచేసిన డిజైన్లను కూడా మీడియా ద్వారానే విడుదల చేసారు. మలేషియా కంపెనీ డిజైన్లను కూడా జనాలకు మీడియా ద్వారానే చూపించారు. సింగపూర్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలను, మాకీ సంస్ధకు చెల్లించిన మొత్తాన్ని బహిర్గతం చేయమని ప్రతిపక్షం ఎంత డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. మాకీ సంస్ధతో అర్థాంతరంగా ఒప్పందాలను రద్దు చేసుకోవటంపై మాకీ సంస్ధ యాజమాన్యం కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదు కూడా చేసింది.
చివరకు బ్రిటన్ కు చెందిన నార్మన్ ఫోస్టర్ కంపెనీ డిజైన్లను రూపొందిస్తోంది. మొన్ననే ఒక డిజైన్ను అందించింది. ఆ డిజైన్నే ప్రభుత్వం మీడియాకు విడుదల చేసి ఇపుడు ఎంఎల్ఏలకు పవర్ పాయింట్ ద్వారా ప్రజంటేషన్ ఇప్పించింది. ఇక్కడే అందరకీ అనుమానాలు మొదలయ్యాయి. హటాత్తుగా డిజైన్ల విషయంలో ప్రభుత్వం అందరికీ ఎందుకు ప్రజంటేషన్ ఇప్పించిందో అర్ధం కావటం లేదు. ఇంతకాలము రాజధాని నిర్మాణం, డిజైన్ల తయారీ తదితరాలను చంద్రబాబు అండ్ కో తమ ప్రైవేటు వ్యవహారంగా మార్చేసింది.
చంద్రబాబునాయడు ప్రభుత్వం ఏర్పడి మూడేళ్ళవుతోంది. ఇంతవరకూ రాజధాని డిజైన్లనే ఖరారు చేయలేదు. నలుగురైదుగురు ఆర్కిటెక్టులు మారారు. ఇపుడు ఫాస్టర్ ఇచ్చిన డిజైన్లు కూడా అంతిమమని అనుకునేందుకు లేదు. ఎందుకంటే, పూర్తిస్ధాయి డిజైన్లను ఇచ్చిన తర్వాత వాటిని ప్రజాభిప్రాయానికి ఉంచుతారట. అపుడు ఎవరైనా మార్పులు, చేర్పులు సూచించినా లేక అభ్యంతరాలు కానీ చెబితే ప్రభుత్వం ఏం చేస్తుంది? మళ్ళీ డిజైన్లను మారుస్తుందా? అంతెందుకు ఇపుడు డిజైన్లను చూసిన ఎంఎల్ఏలు ఎవరైనా మార్పులు చెబితే ప్రభుత్వం అంగీకరిస్తుందా అన్న విషయంలో క్లారిటీ లేదు.ప్రజంటేషన్ సందర్భంగా సభ్యులడిగిన ప్రశ్నలకు ఫోస్టర్ బాగా ఇబ్బంది పడ్డారు.దాంతో చంద్రబాబే బాధ్యతలు తీసుకున్నారు. అయితే సభ్యులడిగిన ప్రశ్నలకు చివరకు చంద్రబాబు కూడా సమాధానం చెప్పలేకపోయారు. ఇది ఫస్ట్ కాపీ మాత్రమేనని, మార్పులు, చేర్పులుంటాయంటూ చంద్రబాబు తప్పించుకున్నారు. చివరకు భాజపా, వైసీపీ సభ్యులెవరూ సంతృప్తి కనబరచకపోవటం గమనార్హం.
ఇలా మార్పులు చేసుకుంటూ పోతే డిజైన్లు ఎప్పటికి తయారౌతాయ్? ఏదో తూతూమంత్రంగా చూపుతున్నారని అనుకుంటే దీని వల్ల కాలయాపన తప్ప ఉపయోగమేమీ లేదు కదా? ఈ విషయాలు తెలిసీ ప్రభుత్వం ఈ పని ఎందుకు చేస్తోంది? అంటే, సమాధానం సింపుల్. మరో రెండేళ్ళలో నిర్మాణాలు సాధ్యం కాదన్న విషయం అందరికీ అర్ధమైపోయింది. కనీసం నిర్మాణాలను మొదలైనా పెడతారా అన్న అనుమానాలు కూడా మొదలయ్యాయి. ఏ కారణం వల్లైనా నిర్మాణాలు మొదలుపెట్టలేకపోతే అందుకు కారణాన్ని ప్రజలమీదో లేక ప్రతిపక్షం మీదో నెట్టేయటానికి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందా అన్న అనుమానాలు మొదలయ్యాయి.
