వైసిపి శ్రేణులకు నెల్లూరు జిల్లాలోని సైదాపురం మండలం సోమవారం ఒక చరిత్రగా మిగిలిపోనున్నది. చంద్రబాబునాయుడు పాలనకు వ్యతిరేకంగా వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న విషయం అందరకీ తెలిసిందే. కడప జిల్లాలోని ఇడుపులపాయలో మొదలైన 3 వేల కిలోమీటర్ల యాత్ర శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురంలో ముగుస్తుంది.

నవంబర్ 6వ తేదీన మొదలైన పాదయాత్ర ఇప్పటికి కడప, కర్నూలు, అనంతరపురం చిత్తూరు జిల్లాల్లో పూర్తి చేసుకుని కోస్తా జిల్లాల్లోకి ప్రవేశించింది. కోస్తా జిల్లాలంటే నెల్లూరు జిల్లానే ముఖద్వారం. చిత్తూరు జిల్లా నుండి నెల్లూరు జిల్లాలోని సూళ్ళూరుపేట ద్వారా జగన్ నెల్లూరు జిల్లాలోకి అడుగుపెట్టారు. ఇక ప్రస్తుత విషయానికి వస్తే, జగన్ మొదటి వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని నెల్లూరు జిల్లాలోనే పూర్తి చేస్తున్నారు.

గూడూరు నియోజకవర్గంలోని గోగినేనిపురం, చెన్నూరు, వెంకటగిరి క్రాస్ రొడ్డు మీదగా వెంకగిరి నియోజకవర్గంలోని సైదాపురం మండలంలోకి జగన్ ప్రవేశిస్తారు. ఈ మండలంలోనే జగన్ పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తవుతోంది. ఆ సందర్భంగా అక్కడ పార్టీ నేతలు సుమారు 20 అడుగుల స్ధూపాన్ని నిర్మిస్తున్నారు. స్ధూపాన్ని ప్రారంభించిన తర్వాత అక్కడ బహిరంగ సభలో మాట్లాడుతారు. పోయిన ఎన్నికల్లో ఈ జిల్లా వైసిపిని బాగా ఆదుకున్నది. ఉన్న 10 నియోజకవర్గాల్లో 7 చోట్ల వైసిపినే గెలిచింది.