మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వైజాగ్ లో వున్న హీరో నవీన్ కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎదురుపడ్డారు. 

విశాఖపట్నం : నవీన్ పొలిశెట్టి... మంచి కామెడీ టైమింగ్ వున్న హీరో. కేఏ పాల్... తన వింత చేష్టలతో ప్రజలను కడుపుబ్బా నవ్వించే పొలిటీషన్. ఇలా ఒకరు రీల్ లైఫ్ లో కామెడీ పండించే హీరో అయితే మరొకరు రియల్ లైఫ్ లో కామెడీ పండిచే రాజకీయ నాయకుడు. ఈ ఇద్దరూ ఒకేచోట కనిపించి సందడి చేస్తే.ఇలాంటి అరుదైన సంఘటనే అనుకోకుండా విశాఖపట్నంలో జరిగింది. నవీన్ పొలిశెట్టి, కేఏ పాల్ ఒకరికొకరు ఎదురుపడటం ఆసక్తికరంగా అనిపించింది. 

నవీన్ పొలిశెట్టి హీరోగా, అనుష్క హీరోయిన్ గా నటించిన 'మిస్ శెట్టి... మిస్టర్ పొలిశెట్టి' సినిమా వచ్చేనెల (సెప్టెంబర్) 7న విడుదల కానుంది. 'జాతిరత్నాలు' సినిమాతో కడుపుబ్బా నవ్వించిన నవీన్ తెలుగు ప్రేక్షకులకు చాలా దగ్గరయ్యాడు. దీంతో 'మిస్ శెట్టి... మిస్టర్ పొలిశెట్టి' మూవీపైనా ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తగ్గకుండా హీరో నవీన్ కూడా ప్రమోషన్స్ జోరు పెంచారు. 

తెలుగు రాష్ట్రాల్లోని అన్నిప్రాంతాలను చుట్టేస్తున్న హీరో నవీన్ తాజాగా విశాఖపట్నంలో వున్నారు. మూవీ ప్రమోషన్స్ లో బిజీబిజీగా గడుపుతున్న హీరో వైజాగ్ బీచ్ రోడ్డులో వెళుతుండగా ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా ప్రస్తుతం వైజాగ్ లోనే వున్నవిషయం తెలిసిందే. నవీన్ బీచ్ రోడ్డులో వెళుతున్న సమయంలో కేఏ పాల్ కొందరు యువకులతో మాట్లాడుతూ కనిపించాడు. దీంతో వెంటనే నవీన్ పొలిశెట్టి తన కారును ఆపి కేఏ పాల్ ను పలకరించారు. పాల్ కూడా నవీన్ కు హాయ్ చెబుతూ ఏదో మాట్లాడారు. అయితే ట్రాఫిక్ లో కారు ఎక్కువసేపు ఆపలేక నవీన్ ముందుకు వెళ్లిపోయాడు. 

Video జాతిరత్నాలును మించిన వినోదంతో మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి..: నవీన్ పొలిశెట్టి

అయితే నవీన్ పొలిశెట్టి, కేఏ పాల్ ఎదురుపడి మాట్లాడుకుంటున్న వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. రీల్ కామెడీ హీరోతో రియల్ లైఫ్ కామెడీ పొలిటీషన్ మాట్లాడుతున్నాడంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు. మరికొందరేమో కేఏ పాల్ తో ఓ ఇంటర్వ్యూ చెయ్ నవీనన్న... నీ సినిమాకు ఫూల్ ప్రమోషన్ జరిగినట్లేనని సలహా ఇస్తున్నారు.