Asianet News TeluguAsianet News Telugu

జగన్ ను చూసి నిజంగానే భయపడుతున్నారా ?

  • ఎలాగూ ప్రతిపక్షం లేదు కాబట్టి చంద్రబాబు నుండి  మంత్రులు, ఎంఎల్ఏలు జగన్ పై రెచ్చిపోయి మాట్లాడుతున్నారు.
Naudu discovers that  investors are scared of jagan and avoiding state

                                           ‘జగన్ అవినీతి గురించి ఇప్పటికీ విదేశాల్లో ఆరా తీస్తున్నారు’

                                           ‘రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే భయపడుతున్నారు’

 

ఇవి…వైసీపీ అధినేత గురించి చంద్రబాబానాయుడు అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు. శుక్రవారం మొదలైన అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించిన సంగతి అందరికీ తెలిసిందే. ఎలాగూ ప్రతిపక్షం లేదు కాబట్టి చంద్రబాబు నుండి  మంత్రులు, ఎంఎల్ఏలు జగన్ పై రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. అసెంబ్లీ వాయిదాపడిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, జగన్ అవినీతి గురించి విదేశాల్లో ఇప్పటికీ ఆరా తీస్తున్నట్లు చెప్పారు.

ఇక్కడే ఓ విషయం అర్ధం కావటం లేదు. జగన్ అక్రమాస్తుల కేసులపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఇప్పటి వరకూ ఒక్క కేసులో కూడా జగన్ అవినీతి నిరూపితం కాలేదు. ఒకవైపు కోర్టులో విచారణ జరుగుతుండగా మరోవైపు చంద్రబాబు ఎలా జగన్ ను అవినీతిపరుడని ముద్రవేస్తారు? జగన్ పై కోర్టులో కేసులున్నట్లే, టిడిపికి చెందిన కేంద్రమంత్రి సుజనా చౌదరి, రాష్ట్రమంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంఎల్సీలు వాకాటి నారాయణరెడ్డి, శ్రీనివాస్ తదితరులపై బ్యాంకులను వందల కోట్లకు చీటింగ్ చేసారన్న కేసులు విచారణలో ఉన్నాయి. మరి, వాళ్ళ అవినీతిగురించి చంద్రబాబు  ఏమంటారు?

ఇక, రెండో విషయానికి వస్తే, రాష్ట్రం.లో పెట్టుబడులు పెట్టాలంటే, భయపడుతున్నారట. ఎందుకు భయపడతారు ? వైఎస్సార్ పాలనకు ముందు రాష్ట్రంలో అవినీతి జరగలేదా ? పెట్టుబడులు రాలేదా? ఏ రాష్ట్రంలో అవినీతి జరగటం లేదు ? అయినా పెట్టుబడులు ఎలా వస్తున్నాయ్ ఆ రాష్ట్రాలకు? అయినా విశాఖపట్నంలో రెండు సంవత్సరాలు జరిపిన భాగస్వమ్య సదస్సులో రూ. 26 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగినట్లు చంద్రబాబే అనేక సార్లు చెప్పారు కదా? అవన్నీ ఉత్తుత్తి ప్రకటనలేనా ? విదేశాలు తిరిగినపుడల్లా వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చేస్తున్నట్లు చేసిన ప్రకటనలన్నీ అబద్దాలేనా?

చంద్రబాబు మాటల్లో ఎక్కడో లాజిక్కు మిస్సవుతోంది. పెట్టుబడులు పెట్టడానికి భయపడుటం అన్నా అబద్దమై ఉండాలి? లేదా లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలన్నా అబద్దం అయిఉండాలి? ముందు ఏది అబద్దం? ఏది నిజం అన్న విషయంలో చంద్రబాబకైనా క్లారిటీ వస్తే బాగుంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios