అమరావతి: వైసీపీ తనకు ఇచ్చిన నోటీసుకు చట్టబద్దత లేదని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు స్పష్టం చేశారు. రాష్ట్ర స్థాయి పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారని  ఆయన ప్రశ్నించారు.

పార్టీ అధినేత జగన్ తో పాటు పశ్చిమ గోడావరి జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యేలపై ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన విమర్శలపై  వారం రోజుల్లోపుగా వివరణ ఇవ్వాలని కోరుతూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ నెల 24వ తేదీన రఘురామకృష్ణంరాజుకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. 

also read:షాక్: ఎంపీ రఘురామకృష్ణంరాజుకు వైసీపీ షోకాజ్ నోటీస్

ఈ నోటీసుపై నిన్ననే స్పందించిన రఘురామకృష్ణంరాజు తాజాగా సాంకేతిక అంశాలను లేవనెత్తారు. ఈ నోటీసుకు చట్టబద్దతే లేదని తేల్చేశారు. తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసినట్టుగా గుర్తు చేశారు. తనకు షోకాజ్ పంపిన లెటర్ హెడ్ కు  .. తాను పోటీ చేసిన సమయంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన బీ ఫామ్ కు తేడా ఉందని  ఆయన చెప్పారు.

also read:జగన్ అపాయింట్‌మెంట్ దొరకలేదు.. అందుకే మాట్లాడా: రఘురామకృష్ణంరాజు

లెటర్ హెడ్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో షోకాజ్ నోటీసులు ఎలా ఇస్తారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు కీలకమైన ప్రశ్నను ఆయన లేవనెత్తారు. రాష్ట్రస్థాయి పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. 

తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని స్పష్టం చేశారు.  టెక్నికల్  అంశాలను  రఘురామకృష్ణంరాజు ప్రస్తుతం తెరమీదికి తీసుకురావడం ఆసక్తికరంగా మారింది.