గుంటూరు: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్రవ్యాప్త పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా అకివీడు మంజలం సిద్ధాపురం వద్ద ట్రాక్టర్ నడిపి ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదం నుండి లోకేష్ సురక్షితంగా బయటపడ్డా ఆయనపై పోలీసులు కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే తనపై నమోదయిన కేసుల గురించి లోకేష్ ఘాటుగా స్పందించారు. 

''రైతుల్ని పరామర్శించడం,రైతులకి అండగా పోరాటం చెయ్యడం,రైతులకి న్యాయం చెయ్యమని డిమాండ్ చెయ్యడం వైఎస్ జగన్ దృష్టిలో నేరం. ఈ నేరంపై కేసు పెట్టే సెక్షన్లు ఆయన పోలీసుల వద్దలేవు. అందుకే కోవిడ్ నిబంధనలు ఉల్లంఘన, ట్రాక్టర్ నడిపారంటూ నాపై కేసులు బనాయించారు'' అంటూ తనపై పెట్టిన కేసుపై లోకేష్ ట్వీట్ చేశారు.
 
''వరద బాధితులను పరామర్శించేందుకు గడప దాటని జగన్ రెడ్డి, గడప గడపకీ వెళ్లే నన్ను అడుగడుగునా అడ్డుకోవాలనుకుంటున్నారు. ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో! కష్టాలలో ఉన్నోళ్ల కన్నీరు తుడిచేందుకు ప్రతీ ఊరూ వెళతా! ప్రతి గడపా తొక్కుతా! బాధితులకు భరోసానిస్తా'' అని సీఎం జగన్ కు సవాల్ విసిరారు నారా లోకేష్. 

లోకేష్ టూర్‌కి మాజీ మంత్రి డుమ్మా: ఏం జరుగుతోంది?
 
పశ్చిమ గోదావరి జిల్లా అకివీడు పోలీసు స్టేషన్ లో లోకేష్ పై కేసు నమోదైంది. నారా లోకేష్ కు ట్రాక్టర్ డ్రైవింగ్ మీద అవగాహన లేదని, అయినప్పటికీ ఆయన వరద ముంపు ప్రాంతాల్లో ట్రాక్టర్ నడిపి ప్రమాదానికి కారణమయ్యారని ఆరోపిస్తూ కేసు నమోదు చేశారు. ఐపీసీ 279, 184, 54ఏ సెక్షన్ల కింద ఎపిడమిక్ యాక్ట్ లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కోవిడ్ నిబంధనలను పాటించలేదని కూడా ఆయనపై కేసు నమోదు చేశారు. 

లోకేష్ నడుపుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి ఉప్పుటేరు కాలువలోకి దూసుకెళుతుండగా పక్కనే ఉన్న ఉండి నియోజకవర్గం ఎమ్మెల్యే మంతెన రామరాజు అప్రమత్తమై ట్రాక్టర్ ను అదుపు చేశారు. ఆ తర్వాత నారా లోకేష్ ను ట్రాక్టర్ మీది నుంచి దింపేశారు. దాంతో లోకేష్ కు ప్రమాదం తప్పింది. ప్రమాదం తప్పడంతో ఆయన వెంట ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.