చంద్రబాబు అరెస్ట్ .. ‘‘ జగనాసురుడికి కళ్లు తెరిపిద్దాం ’’ అంటూ మరో నిరసనకు లోకేష్ పిలుపు
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ ‘‘అరాచక, చీకటి పాలన సాగిస్తోన్న జగనాసురుడికి కళ్లు తెరిపిద్దాం’’ పేరుతో మరో వినూత్న కార్యక్రమానికి నారా లోకేష్ పిలుపునిచ్చారు.

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్‌ను నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు గడిచిన రెండు నెలలుగా ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిరసన కార్యక్రమాల్లో స్వయంగా చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా పాల్గొంటున్నారు. ఇప్పటికే మోత మోగిద్దాం, కాంతితో క్రాంతి, న్యాయానికి సంకెళ్లు, జగనాసుర దహనం కార్యక్రమాలతో వినూత్న నిరసన తెలిపిన సంగతి తెలిసిందే.
తాజాగా ‘‘అరాచక, చీకటి పాలన సాగిస్తోన్న జగనాసురుడికి కళ్లు తెరిపిద్దాం’’ పేరుతో మరో వినూత్న కార్యక్రమానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా ఆదివారం రాత్రి 7 గంటల నుంచి 7.05 మధ్యలో కళ్లకు గంతలు కట్టుకుని ఇంటి ముందు, బాల్కనీలు, వీధుల లోకి వచ్చి చంద్రబాబుకు మద్ధతుగా నిజం గెలవాలని గట్టిగా నినాదాలు చేయాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. అనంతరం దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయాలని లోకేష్ కోరారు.
ఇకపోతే.. ఏపీ సీఐడీ కాల్ డేటా ఇవ్వాలని చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పును రిజర్వ్ చేసింది ఏసీబీ కోర్టు. శుక్రవారంనాడు ఈ పిటిషన్ పై ఇరు వర్గాల వాదనలు విన్పించారు. ఇరువర్గాల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టుగా ఏసీబీ కోర్టు తెలిపింది. ఈ పిటిషన్ పై ఈ నెల 31న ఏసీబీ కోర్టు తీర్పును వెల్లడించే అవకాశం ఉంది. చంద్రబాబు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ సీఐడీ తరపు న్యాయవాదులు నిన్ననే కౌంటర్ దాఖలు చేశారు.
ALso Read: పెద్దమ్మ ఆశీర్వాదం... చిన్నారి పలకరింపు... వసంతమ్మ ఫ్యామిలీకి భువనమ్మ ఆత్మీయ పరామర్శ (ఫోటోలు)
చంద్రబాబు అరెస్ట్ కు రెండు రోజుల ముందు నుండి ఏపీ సీఐడీ అధికారుల మొబైల్ కాల్ డేటా ఇవ్వాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు కోరారు. ఏపీ సీఐడీ అధికారులు ఎవరెవరితో మాట్లాడారనే విషయాలు బయటకు వస్తాయని చంద్రబాబు తరపు న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల ఆదేశాల మేరకు చంద్రబాబును అరెస్ట్ చేసినట్టుగా తమకు అనుమానాలున్నాయని బాబు లాయర్లు కోర్టులో వాదించారు. ఈ కారణంగానే తాము మొబైల్ డేటా అడుగుతున్నామన్నారు.
చంద్రబాబు విచారణ సమయంలో కూడ ఫోటోలు, వీడియోలు కూడ బయటకు వచ్చిన విషయాన్ని బాబు లాయర్లు ఈ సందర్భంగా ప్రస్తావించారు. విచారణ చేసే అధికారుల మొబైల్ కాల్ డేటాను బయటకు ఇస్తే సీఐడీ అధికారుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్టు అవుతుందని సీఐడీ తరపు న్యాయవాదులు వాదనలు విన్పించారు. అయితే అధికారుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించే మొబైల్ కాల్ డేటాను తాము అడగడం లేదని చంద్రబాబు తరపు న్యాయవాదులు పేర్కొన్నారు. ఇవాళ సుమారు గంటకు పైగా ఇరు వర్గాల న్యాయవాదులు ఏసీబీ కోర్టులో తమ వాదనలు విన్పించారు. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేస్తున్నట్టుగా ఏసీబీ కోర్టు జడ్జి ప్రకటించారు.