చెప్పిందే చెప్పి దాదాపు రెండు గంటల పాటు సభ్యుల సహనానికి పరీక్ష పెట్టారు చంద్రబాబునాయుడు. బుధవారం మధ్యాహ్నం అసెంబ్లీలో మాట్లాడిన చంద్రబాబు విభజన చట్టంలోని అంశాలను చదవి వినిపించారు. కేంద్రం ఒకవైపు విభజన చట్టాన్ని అమలు చేయటం సాద్యం కాదని చెప్పేసిన తర్వాత కూడా అదే చట్టాన్ని అమలు చేయాలని పదే పదే డిమాండ్ చేయటంలో అర్ధమేంటో చంద్రబాబే చెప్పాలి.

తానేదో కేసులకు భయపడి కేంద్రానికి లొంగిపోయానని ప్రచారం జరుగుతోందని చంద్రబాబు మండిపడ్డారు. తనపై ఒక్క కేసు కూడా లేదన్నారు. తనపై కేసులు పెట్టి ఇరికించేందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదన్నారు. విద్యార్ధి దశ నుండి ఒక్క కేసు కూడా తనపై నమోదు కాలేదన్నారు. తాను చాలా క్రమశిక్షణతో ఉంటానని తన భుజాన్ని తానే చరుచుకున్నారు.

జాతీయ స్ధాయిలో తాను చాలా సార్లు కీలక పాత్ర పోషించినట్లు చెప్పారు. నేఫనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించినట్లు చెప్పుకున్నారు. దేశంలోనే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ తానే అని చెప్పుకున్నారు.

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రం సహకరించటం లేదన్నారు. ఏపి విషయంలో కేంద్రం కనికరించటం లేదని మండిపడ్డారు. పైగా రాష్ట్రానికి వ్యతిరేకంగా కేంద్రం లీకులు ఇవ్వటం తనకు బాధకలిగించిందన్నారు. ప్రత్యేకహోదాను సభ సాక్షిగా డిమాండ్ చేస్తున్నట్లు స్సష్టంగా ప్రకటించారు. విభజన చట్టంలో పేర్కొన్న విద్యాసంస్ధలు, పారిశ్రామిక ప్రోత్సాహకాలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధికి నిధులు, పరిశ్రమలు, ఆర్ధికలోటు, అసెంబ్లీ స్ధానాల పెంపు ఇలా..ఏది తీసుకున్నా సహకరించటం లేదంటూ కేంద్రంపై మండిపడ్డారు.

బుధవారం ఉదయం అసెంబ్లీ మొదలయ్యే సమయానికి బిజెపి-టిడిపి పొత్తుల విషయంలో ఏదో జరగబోతోందనే భ్రమలు కల్పించారు చంద్రబాబు. ఫెడరల్ స్పూర్తితో ముందుకు పోతున్నట్లు చెప్పుకున్నారు. విభజన చట్టం అమలులో బిజెపి ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తోందని నిలదీశారు. మొత్తానికి సభలో అంతసేపు మాట్లాడిన చంద్రబాబు ప్రతీ విషయంలోనూ కేంద్రానికి విజ్ఞప్తితి చేయటం గమనార్హం.