‘‘ఇళ్ళ నిర్మాణంలో ఎక్కడా అవినీతి జరగకూడదు’’, ‘‘ఒక్కపైసా అవినీతి జరిగినా కఠిన చర్యలు ఉంటాయ్’’...ఇవి చంద్రబాబునాయుడు తాజాగా చేసిన హెచ్చరిక. మూడున్నరేళ్ళుగా చంద్రబాబు అవినీతిపై హెచ్చరిస్తూనే ఉన్నారు. జరిగేది జరుగుతూనే ఉంది. పోలవరం, పట్టిసీమ, గోదావరి, కృష్ణా పుష్కరాల పనులు ఇలా ఏ ప్రాజెక్టు చూసినా అవినీతే. ఏ నీటిపారుదల ప్రాజెక్టను తీసుకున్నా అవినీతి కంపే. అంతెందుకు, పట్టిసీమలో సుమారు రూ. 400 కోట్లు అవినీతి జరిగిందని స్వయంగా కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) ఇచ్చిన నివేదికకే దిక్కులేదు. ఇంతవరకూ ఎవ్వరిపైనా చర్యలు లేవు.

ఇక, అక్రమ ఇసుక రవాణా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కేవలం పచ్చ తమ్ముళ్ళ కోసమే పుట్టిన పథకమది. రీచులు అక్రమమే, తవ్వకాలు అక్రమమే, అమ్మకాలూ అక్రమమే. పేరుకు మాత్రమే డ్వాక్రా గ్రూపులు. వ్యాపారం చేసేదంతా తమ్ముళ్ళే అన్న విషయం బహిరంగ రహస్యమే. ఇక, భూములు ఎక్కడబడితే ఆక్రమణలు. వేలకోట్ల రూపాయలు విలువైన భూములను తమ్ముళ్ళు అడ్డగోలుగా సొంతం చేసేసుకుంటున్నా అడిగే దిక్కేలేదు.  అటువంటిది చంద్రబాబు అవినీతిని సహించనని హెచ్చరించటమంటే వినటానికే ఏదో విధంగా ఉంది.