"కమ్యూనిజమా, క్యాపిటలిజమా అనేది కాదు ముఖ్యం. సిద్ధాంతాలేవైనా ఫలితాలు రావాలని చైనా కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత డెంగ్ జియావో పింగ్ చెప్పాడు. మనం పెంచే పిల్లి ఎర్రదా, నల్లదా అన్నది ప్రధానం కాదు. పిల్లి రంగేదయినా ఎలుకలు పడుతుందా లేదా అనేదే ముఖ్యమని చైనాలో డెంగ్ జియావోపింగ్ చెప్పారు."
ఆంధ్రప్రదేశ్ లో ఏడు రంగుల ఆసుప్రతులొస్తున్నాయి. ఇకనుంచి ప్రభుత్వాసుపత్రుల అరోగ్యంగా, శుభ్రంగా పనిచేస్తున్నాయనేందుకు గుర్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడు రంగుల విధానం ప్రవేశపెడుతున్నారు.
ప్రభుత్వాస్పత్రులలో రోగులు నిద్రించే బెడ్స్ మీద దుప్పట్లు, దిండు గలీబులను ప్రతిరోజూ మారుస్తారు. మారుస్తున్నారో లేదో కనుగొనేందుకు ఈ రంగులే సాక్షి. ఒక్క రోజుకు ఒక్కొక్క రంగుబెడ్ షీట్లు, దిండు కవర్లుంటాయి. దీనికోసం వారానికి ఏడు రంగులలో దుప్పట్లు, గలీబులు సరఫరా చేస్తారు. ఏ రోజు ఏ రంగు ఉంటుందో చూడవచ్చు. ఆరోజు ఆ రంగు లేకపోతే, పడకను శుభ్రం చేయనట్లు లెక్క. అంతే..
ఈ విషయాన్ని ముఖ్యమంత్రి స్వయంగా వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం సచివాలయంలో ఆయన పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో ‘ముఖ్యమంత్రి ఆరోగ్యకేంద్రాల’ను ప్రారంభించారు. ఇదే వేదికపై ఆరోగ్య రక్ష పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏడురంగుల ఆసుపత్రుల వివరాలిందిస్తూ ఇలా పరుపు కవర్లు, దిండు కవర్లు మార్చేందుకు ఏర్పాట్లు చేశామని సీఎం వివరించారు.
‘ఒకప్పుడు ప్రభుత్వ ఆస్పత్రులు అనారోగ్యానికి నిలయాలుగా ఉండేవి. ఈ పరిస్థితిని మేము సమూలంగా మార్చివేశాం. కమ్యూనిజమా, క్యాపిటలిజమా అనేది కాదు, ముఖ్యం. సిద్ధాంతాలు ఏవైనా ఫలితాలు రావాలని చైనా కమ్యూనిస్టు పార్టీ అగ్రనేత డెంగ్ జియావో పింగ్ చెప్పాడు. మనం పెంచే పిల్లి ఎర్రదా? నల్లదా అన్నది ప్రధానం కాదని, ఏ పిల్లి అయినా ఎలుకలు పడుతుందా లేదా అనేదే ముఖ్యమని చైనాలో డెంగ్ జియావోపింగ్ చెప్పి అక్కడ సంస్కరణలు తీసుకొచ్చారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు రెండు షిఫ్టులలో పనిచేస్తాయి. రోగులు గంటల తరబడి క్యూలలో నిల్చునే పనిలేదు,’ అని ముఖ్యమంత్రి అన్నారు.
వైద్య చికిత్సకు వచ్చిన వారు సేదతీరేలా ఎయిర్ కండిషన్డ్ గదిలో ఉంచి చికిత్స చేస్తామన్నారు. ఆదివారం, ఇతర సెలవుదినాలలో ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సదుపాయాలు పొందవచ్చని వివరించారు.
