బాలకృష్ణ పిఏపై వ్యతిరేకతతో నియోజకవర్గంలోని నేతలంతా పార్టీకి రాజీనామాలు చేయటానికి సిద్ధపడితేత గానీ అధినేతలో చలనం రాలేదు.
ఎట్టకేలకు హిందుపురం నియోజకవర్గంలో బాలకృష్ణ పిఏపై వేటుపడింది. బాలకృష్ణ పిఏ హోదాలో చంద్రశేఖర్ నియోజకవర్గంలో డిక్టేటర్ లాగ వ్యవహరిస్తున్నారంటూ పార్టీ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా రెండేళ్ళుగా మండిపడుతున్నారు. ఎవరూ వారి గోడును పట్టించుకోలేదు. దాంతో ఒళ్ళుమండిన నేతలంతా మూకుమ్మడిగా పార్టీకి రాజీనామాలకు సిద్ధపడితే గానీ పార్టీ అధినేతలో చలనం రాలేదు. పర్యవసానంగా పిఏను తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గ సమస్యలు చెప్పుకోవాలన్నా, బాలకృష్ణను కలవాలన్నా పిఏ అనుమతి లేనిదే సాధ్యం కాని పరిస్ధితి. దాంతో పిఏపైనే ఫిర్యాదు చేయాలని నేతలు ప్రయత్నిస్తే బాలకృష్ణ ఎవరినీ దగ్గరకు కూడా రానీయలేదు. ఎంతకాలం వేచిచూసినా బాలకృష్ణలో మార్పు కనబడకపోవటంతో ఏకంగా బాలకృష్ణపైనే నేతలు ధ్వజమెత్తటం మొదలుపెట్టారు.
చివరకు నియోజకవర్గంలో పార్టీ మనుగడకే ఎసరు వస్తుండటంతో చంద్రబాబు, లోకేష్ కల్పించుకోవాల్సి వచ్చింది. మంగళవారం ఉదయం బాలకృష్ణతో తండ్రి, కొడుకులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఏమి జరిగిందో తెలీదుగానీ మొత్తానికి శేఖర్ ను నియోజకవర్గం నుండి తప్పించటానికి బాలకృష్ణ అంగీకరించారు. ఇదే విషయాన్ని చంద్రబాబు మాటగా ఎమ్మిగనూరు ఎంల్ఏ, పార్టీ ప్రధాన కార్యదర్శి నాగార్జునరెడ్డి ఫోన్ ద్వారా నియోజకవర్గంలోని నేతలకు చెప్పారు.
విచిత్రమేమిటంటే బాలకృష్ణ పిఏపై వ్యతిరేకతతో నియోజకవర్గంలోని నేతలంతా పార్టీకి రాజీనామాలు చేయటానికి సిద్ధపడితేత గానీ అధినేతలో చలనం రాలేదు. ఇంత జరిగిన తర్వాత కూడా తన పిఏను వదులుకోవటానికి బాలకృష్ణ ఇష్టపడకపోవటం గమనార్హం. తప్పని పరిస్ధితిల్లో అదికూడా చంద్రబాబు, లోకేష గట్టిగా ఒత్తిడి పెడితేగానీ బాలకృష్ణ దిగిరాలేదు. అంటే పిఏకి ఇచ్చేపాటి ప్రాధాన్యత తనను గెలిపించిన పార్టీ నేతలకు, కార్యకర్తలకు బలకృష్ణ ఇవ్వాలనుకోకపోవటం నిజంగా దురదృష్టకరం.
