చంద్రబాబుకు చుక్కలు చూపిస్తున్న కెసిఆర్

Naidu kept at bay by kcr even for world  telugu conference
Highlights

  • ఇంతలో ఎంతలా మారిపోయింది చంద్రబాబునాయుడు పరిస్ధితి.

ఇంతలో ఎంతలా మారిపోయింది చంద్రబాబునాయుడు పరిస్ధితి. సమైక్య రాష్ట్రాన్ని దాదాపు తొమ్మిదేళ్ళు ముఖ్యమంత్రిగా ఏలిన వ్యక్తికి, పదేళ్ళు ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తికి అందునా ఇపుడు ఏపి ముఖ్యమంత్రి కూడా. అటువంటి ‘40 ఇయర్స్ ఇండస్ట్రీ’కి హైదరాబాద్ లో ఇటువంటి పరిస్దితి దాపురిస్తుందని ఎవరూ కలలో కూడా అనుకుని ఉండరు. అధికారికంగా హైదరాబాద్ లో అడుగు పెట్టలేని పరిస్దితి తలెత్తింది చంద్రబాబుకు. ప్రోటోకాల్ ప్రకారం రాజధానిలో అధికారికంగా తిరగలేని పరిస్థితిలో చంద్రబాబున్నారు.

ఇంతకీ విషయం ఏంటంటే, తెలుగు రాష్ట్రాలు రెండింటికీ హైదరాబాద్ 10 ఏళ్ళ ఉమ్మడి రాజధాని అన్న విషయం అందరికీ తెలిసిందే. సరే, కారణాలేవైనా చంద్రబాబు హైదరాబాద్ నుండి మూట ముల్లె సర్దేసుకుని ఏడాదికే విజయవాడకు వెళ్ళిపోయారు. అంతకుముందు రాజధాని పరిధిలో  రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి లాంటి అత్యున్నత స్ధాయి వ్యక్తులు ఎవరొచ్చినా ప్రోటోకాల్ ప్రకారం చంద్రబాబు కూడా హాజరయ్యేవారు. అటువంటిది విజయవాడకు మకాం మార్చేయటంతో ప్రోటోకాల్ లేదు ఏమీ లేదు. ‘ఓటుకునోటు’ దెబ్బకు అంతా గాలికి కొట్టుకుపోయింది.

ఎప్పుడైతే చంద్రబాబు విజయవాడకు మకాం మార్చేశారో అప్పటి నుండి తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా చంద్రబాబును దూరం పెట్టేసారు. రాజధాని పరిధిలో జరిగే ఏ కార్యక్రమానికి కూడా చంద్రబాబును కెసిఆర్ ఆహ్వానించటం లేదు. మొన్ననే జరిగిన మెట్రో ప్రారంభోత్సవ కార్యక్రమంతో పాటు గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ కు కూడా చంద్రబాబుకు ఆహ్వానం అందని విషయం అందరికీ తెలిసిందే.

తాజాగా ప్రపంచ తెలుగు మహాసభలకు కూడా చంద్రబాబును కెసిఆర్ ఆహ్వానించలేదు. ప్రోటోకాల్ ప్రకారం తనకు అందాల్సిన ఆహ్వానాలను చంద్రబాబు డిమాండ్ చేసే స్ధితిలో లేరు. అదే విషయం ఇపుడు పెద్ద చర్చనీయాంశమైంది. చూడబోతే, హైదరాబాద్ లో ఇంటికి, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు లేకపోతే రాజ్ భవన్లో కార్యక్రమానికి తప్ప చంద్రబాబు ఇంకదేనికీ అడుగుపెట్టే అవకాశం లేదేమో అనిపిస్తోంది.

loader