ఎక్కడైనా లాభం వస్తుందనుకుంటే తనది, నష్టం తప్పదనుకుంటే పక్కవాడిదన్నట్లుగా ఉంది చంద్రబాబు మాటలు.
ఏంటో చంద్రబాబునాయుడు మాటలు అర్ధమే కావటం లేదు. ఆకాశమే హద్దుగా అమరావతి అభివృద్ధి చెందుతోందన్నారు. అందరికీ తెలిసిన విషయమేమిటంటే ఇప్పటికైతే అమరావతి అన్నది ఓ భావన మాత్రమే. ‘డిజధన్’ మేళాలో మాట్లాడుతూ, దేశంలో ఎక్కడ కొత్త విధానానికి నాంది పలికినా అందుకు కేరాఫ్ అడ్రస్ గా అమరావతి నిలుస్తోందన్నారు.
వినేవాళ్ళు నవ్వుకుంటారని కూడా వెరపు లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ఒకటికి మూడు సార్లు శంకుస్ధాపన జరిగిందే కానీ మళ్ళీ ఇంత వరకూ ఒక్క ఇటుక కూడా వేయలేదు. ప్రస్తుత పరిస్ధితిల్లో అసలు అమరావతి నిర్మాణం మొదలవుతుందో లేదో కూడా అనుమానమే. అటువంటిది అభివృద్ధికి అమరావతి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తోందని చంద్రబాబు చెప్పటం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.
పెద్దనోట్ల రద్దుకు తనకు ఏమీ సంబంధం లేదని ఓసారి అంటారు. ఇంకోసారేమో పెద్ద నోట్లను రద్దు చేయమని ప్రధానికి తానే సిఫారసు చేసానని చెబుతారు. నగదు రహిత లావాదేవీలు పెరుగుతున్నాయని తాజాగా చెప్పారు. మొన్నా మధ్య మాట్లాడుతూ, క్యాష్ లెస్ లావాదేవీలంటే కష్టమేనన్నారు. నగదు సరిపడా లేకపోతే ప్రజల్లో అసంతృప్తి చోటుచేసుకుంటుందన్నారు.
ప్రజల్లో అసంతృప్తి పెరిగితే అది రెండు పార్టీలకూ నష్టమేనని ఇంకోమారు చెప్పారు. తాజాగా మాట్లాడుతూ నగదు రహిత లావాదేవీలకు సహకరించిన మొట్టమొదటి వ్యక్తిని తానేనంటూ తన జబ్బలు తానే చరుచుకున్నారు. ఇదంతా చూస్తుంటే ఎక్కడైనా లాభం వస్తుందనుకుంటే తనది, నష్టం తప్పదనుకుంటే పక్కవాడిదన్నట్లుగా ఉంది చంద్రబాబు మాటలు.
