కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేయటంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఆరితేరిపోయింది. అవసరమున్న లేకపోయినా ప్రాజెక్టులు టేకప్ చేయటం, అంచనాలు పెంచేసి కాంట్రాక్టర్లకు దోచిపెట్టటం మామూలైపోయింది.  ఈ విషయంలో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఎంతగా విమర్శిస్తున్నా చంద్రబాబు ఏమాత్రం లెక్క చేయటం లేదు. తాజాగా స్పీకర్ కోడెల శివప్రసాద్ చెప్పిన విషయాలు వింటుంటే ఆరోపణలు నిజమే అనిపిస్తోంది.

ఇంతకీ విషయం ఏమిటంటే, త్వరలో తాత్కాలికంగా అసెంబ్లీ ప్రాంగణంలోనే మరో భవనం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందట. కొత్త భవనం ఎందుకంటే, ఇపుడున్న అసెంబ్లీ భవనం సరిపోవటం లేదట. సిబ్బంది తదితర అవసరాలకు ప్రస్తుత భవనం ఇరుకైపోయిందట. ప్రభుత్వం చెబుతున్న వాదన విచిత్రంగా లేదూ? ఇపుడున్న తాత్కాలిక భవనమే ఈమధ్య కట్టింది. కట్టేటపుడే సిబ్బంది ఎంతమంది ఉన్నారు? ఇతర అవసరాలేమిటి అన్న విషయాలు ఆలోచించ లేదా? భవిష్యత్ అవసరాలను కుడా దృష్టిలో పెట్టుకునే కదా నిర్మాణాలు మొదలుపెడతారు.

మరి అటువంటి ఆలోచనలేమీ లేకుండానే తాత్కాలిక అసెంబ్లీని నిర్మించేశారా? ప్రభుత్వం చెబుతున్న మాటలు వింటుంటే అంతా విచిత్రంగా ఉంది. 4,600 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త భవనం కడతారట. మళ్ళీ దానికి కోట్ల రూపాయలు ఖర్చు. కొత్తగా కట్టే తాత్కాలిక భవనంలో మొదటి అంతస్తులో  అసెంబ్లీ సిబ్బంది, గ్రౌండ్ ప్లోర్ లో  మీడియా పాయింట్, లైబ్రరీ, క్యాంటీన్, సెక్యూరిటీ ఆఫీసులు ఉంటాయట.

ప్రస్తుతం ఉన్న భవనాలలో సిబ్బంది నూతన భవనంలోకి వెళ్లిన తర్వాత ఖాళీ అయిన గదులను మంత్రులు, విఫ్ లకు కేటాయిస్తారట.  అసెంబ్లీ కమిటీలకు సహయపడే విధంగా నూతన భవనాల నిర్మాణం ఉంటుందట. అసెంబ్లీలో సిబ్బంది కోరతను అధిగమించేందుకు అదనపు సిబ్బందిని నియమించుకునేందుకు చంద్రబాబు అంగీకరించారట.