రాజధాని, పోలవరం ఇక దైవాధీనాలేనా ?

First Published 25, Dec 2017, 3:21 PM IST
Naidu finally leaves the capital and polavaram crisis  to  God
Highlights
  • రాజధాని, పోలవరం నిర్మాణాలిక దైవాధీనాలేనా ?

రాజధాని, పోలవరం నిర్మాణాలిక దైవాధీనాలేనా ? చంద్రబాబునాయుడు తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి అదే అర్ధమవుతోంది. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, రాజధానికి, పోలవరానికి అడ్డంకులు తొలగాలని ప్రార్ధన చేశానని చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు చాలా ప్రయత్నాలే చేస్తున్నారు. ఒక్కటీ కొలిక్కి రావటం లేదు. ఎందుకంటే, ఇంత వరకూ రాజధానికి డిజైన్లే ఖరారు కాలేదు. ఎన్నికలేమో  ముంచుకు వచ్చేస్తున్నాయి. కాబట్టి రాజధాని నిర్మాణం ఏమవుతుందో ఎవరూ చెప్పలేకున్నారు.

ఇక, జాతీయ ప్రాజెక్టయిన పోలవరాన్ని కేంద్రం నుండి చంద్రబాబే లాక్కున్నారు. అక్కడి నుండి సమస్యలు మొదలయ్యాయ. సామర్ధ్యం లేని ట్రాన్స్ స్ట్రాయ్ సంస్ధ వల్ల ప్రాజెక్టు పూర్తి కాదన్న విషయం అందరికీ ఎప్పుడో అర్ధమైపోయింది. చంద్రబాబుకే ఇపుడు తెలిసింది. దాంతో కాంట్రాక్టర్ ను మార్చాలని చంద్రబాబు అనుకున్నారు. అందుకు కేంద్రం ఒప్పుకోలేదు. అసలు డ్యాం కన్నా ముందు కొసరుగా కాఫర్ డ్యాం నిర్మించి నీళ్ళిచ్చేద్దామని అనుకున్నారు. దానికీ కేంద్రం అంగీకరించలేదు. అసలు కాఫర్ డ్యాం నిర్మాణమే వద్దనేసింది.

ఇవన్నీ పక్కనబెడితే ఇప్పటి వరకూ కేంద్రం నుండి వచ్చిన నిధులకు లెక్కలూ చెప్పలేదు. లెక్కలు చెబితే కానీ మళ్ళీ నిధులు ఇచ్చేది లేదని తేల్చేసింది కేంద్రం. దాంతో ఏం చేయాలో చంద్రబాబుకు అర్ధం కావటం లేదు. ప్రధానమంత్రితో చెప్పుకుందామంటే ఏడిదిన్నరగా అపాయిట్మెంటే దొరకలేదు. అందుకే భాజపా ఎంపిలు, ఎంఎల్ఏలను కేంద్ర మంత్రుల వద్దకు రాయబారానికి పంపారు. వారితో కూడా పెద్దగా వర్కవుట్ అయినట్లు లేదు. పైగా ప్రాజెక్టు కూడా కేంద్రం చేతిలోకి వెళ్ళిపోయే అవకాశాలే కనబడుతున్నాయి.

దాంతో ఏం చేయాలో దిక్కుతోచని స్ధితిలో ఉన్నారు చంద్రబాబు. అందుకే రాజధాని, పోలవరం నిర్మాణాలకు అడ్డుంకులు తొలగాలని చివరాఖరుకు క్రిస్మస్ పండుగ సందర్భంగా ఏసుప్రభువును వేడుకున్నారు. ఇంతకీ రాజధాని, పోలవరంకున్న అడ్డంకులేమిటి?  అసలు అడ్డంకులు సృష్టిస్తున్నదెవరు? అని మాత్రం చెప్పలేదు.  

loader