రెండున్నర సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు కూడా వైఎస్ పై ఆరోపణలతోనే కాలం వెళ్లదీస్తున్నారు కానీ విచారణ నిమ్మితం ఓ కమిటిని ఎందుకు వేయలేదు?

వైసీపీ తరపున గెలిచి పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులనే టిడిపి జగన్మోహన్ రెడ్డిపైకి ఉసిగొల్పతోంది. తాజాగా భూమా నాగిరెడ్డి తీరు అదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. గతంలో జ్యోతుల నెహ్రూతో కూడా టిడిపి అదే పనిచేయించింది.

టిడిపిలో ఉన్న వారితో జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేయించేకన్నా ఫిరాయించిన వైసీపీ ఎంఎల్ఏలతోనే ఆ పని చేయిస్తే ప్రజలు నమ్ముతారని టిడిపి నాయకత్వం భావిస్తోందో ఏమో.

గతంలో వైఎస్ విషయంలో టిడిపి అనేకమార్లు చేసిన జలయజ్ఞం(దనయజ్ఞం) ఆరోపణలనే తాజాగా భూమా కూడా చేస్తున్నారు. వైఎస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులన్నింటిలోనూ అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు.

తాను పబ్లిక్ అకౌంట్స్ కమిటి (పిఎసి) ఛైర్మన్ గా ఉన్నపుడు రాష్ట్రంలో జరిగిన ప్రాజెక్టుల వివరాలు సేకరించానన్నారు. ప్రతీ ప్రాజెక్టులో జరిగిన అవినీతి తాలూకు రికార్డులు తన వద్ద ఉన్నాయని అంటున్నారు.

అంటే జలయజ్ఞం పేరు చెప్పి జగన్ను నాగిరెడ్డి బ్లాక్ మైల్ చేస్తున్నట్లే ఉంది. లేకపోతే ఎప్పుడో జరిగిపోయిన జలయజ్ఞం ప్రస్తావన ఇపుడు తేవాల్సిన అవసరం లేదు. వైఎస్ మరణించిన తర్వాత ఐదేళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. వైఎస్ హయాంలో వచ్చిన ఆరోపణలపై హైకోర్టులో విచారణ కూడా జరుగుతోంది.

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఎన్నికలు జరిగాయి. రెండున్నర సంవత్సరాల క్రితంఅధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు కూడా వైఎస్ పై ఆరోపణలతోనే కాలం వెళ్లదీస్తున్నారు కానీ విచారణ నిమ్మితం ఓ కమిటిని ఎందుకు వేయలేదు? అనవసరం అనుకున్నారా? అనవసరమైతే మరి ఇపుడు భూమా ద్వారా మళ్ళీ అవే విషయాలను తెరపైకి ఎందుకు తెస్తున్నట్లు?

వైఎస్ హయాంలో జరిగిన అవినీతిపై చర్చకు తాను సిద్ధమని భూమా సవాలు విసురుతుండటం గమనార్హం. నిజంగానే జలయజ్ఞంపై భూమావద్ద ఆధారాలుంటే టిడిపి ప్రభుత్వం జగన్ను విడిచిపెట్టేదేనా. ఏదో ఒకరూపంలో జగన్ను ఇరికించేందుకు ప్రయత్నాలు చేసేదే.

ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ లేరు, జగన్ కూడా 16 మాసాలు జైలు జీవితం గడిపి బైలుపై తిరుగుతున్నారు. ఈ విషయాలు తెలిసీ భూమా జగన్ పై తాజాగా జలయజ్ఞం ఆరోపణలు చేస్తున్నారంటే వ్యూహాత్మకమే.

పైగా తన వద్ద రికార్డెడ్ ఆధారాలుంచుకుని కూడా ప్రభుత్వానికి ఇవ్వకపొవటం నేరం క్రిందకి వస్తుందేమో. ఓసారి భూమా ఆలోచించటం మంచిది.