ఏపీకి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగించాలని ఎంపీలను చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఢిల్లీలో ఉన్న ఎంపీలతో ముఖ్యమంత్రి మంగళవారం ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రజల గొంతు పార్లమెంట్‌లో ప్రతిధ్వనించాలన్నారు. ఐదు కోట్ల మంది ప్రజల మనోభావాలపై కేంద్రం ఉదాసీనత సరికాదని అన్నారు. పునర్ వ్యవస్థీకరణ చట్టం, హామీల అమలుపై అసెంబ్లీలో తీర్మానం చేస్తామని సీఎం చెప్పారు. మన పోరాటం నిర్మాణాత్మకంగా జరగాలని ఎంపీలకు సూచించారు. ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఎంపీలు పోరాడాలని ఆదేశించారు.

అలాగే అసెంబ్లీ, మండలి చీఫ్‌ విప్‌లు, విప్‌లు, ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోవాలని చంద్రబాబు సూచించారు. అంతేగాక పార్లమెంటులో ఇతర పార్టీల ఎంపీలను కూడా కలుపుకోవాలన్నారు. ఆ రోజు సెంటిమెంటుకు ప్రత్యేక రాష్ట్రమే ఇచ్చిన వారు ఈరోజు సెంటిమెంటు చూసి కనీసం డబ్బులివ్వలేమంటారా..? అంటూ మండిపడ్డారు. తమ డిమాండ్లు హేతుబద్ధమైనవని, ఇచ్చిన హామీలు అమలు చేయాలనడం అహేతుకమా ? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు.