Asianet News TeluguAsianet News Telugu

ఎన్నికల సభల్లాగే ఉంది

రుణమాఫీ అన్నది కేంద్రప్రభుత్వ పథకం కాదు. గడచిన ఎన్నికల్లో గట్టెక్కేందుకు చంద్రబాబు ఇచ్చిన హామీ. అధికారంలోకి వచ్చారు కాబట్టి చంద్రబాబు మాత్రమే నెరవేర్చాల్సిన హామీ.

Naidu converts Janmabhoomi in to election programme

ప్రభుత్వం నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమం ఎన్నికల సభను తలపిస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురంలో గురువారం జన్మభూమి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, స్ధానిక ఎంఎల్ఏ తోట త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు.

 

కార్యక్రమం సందర్భంగా సిఎం మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. కొందరు లబ్దిదారులతో కూడా మాట్లాడించారు. ఆ సందర్భంగా మాట్లాడిన లబ్దిదారులందరూ తమకు ప్రభుత్వ పథకాలన్నీ సక్రమంగా అందుతున్నాయని, తాము బ్రతికున్నంత కాలం టిడిపికే ఓటు వేస్తామంటూ చిలకపలుకులు పలికారు.

 

అపుడు చంద్రబాబు జోక్యం చేసుకుని ఆ విషయాలను ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేయాలని ముసిముసి నవ్వులతో చెప్పారు. అందుకోసమే ప్రభుత్వం ‘ధన్యవాదాల కార్యక్రమం’ రూపొందించిందన్నారు.

 

జన్మనిచ్చిన తల్లిదండ్రులు, విద్య నేర్పిన గురువు, పెద్దలు, సమాజంతో పాటు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వానికి కూడా ప్రతీ ఒక్కరూ రుణపడి వుండాలన్నారు.

 

అదేవిధంగా స్ధానిక ఎంఎల్ఏ, ఉప ముఖ్యమంత్రి, ఎంపిని అందరూ గుర్తుంచుకోవాలని చెప్పటం విశేషం. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రతీ ఊరిలోనూ ప్రచారం చేయాలని చెప్పారు.

 

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రుణమాఫీ పథకాలను అమలు చేస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. రైతు, డ్వాక్రా, చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేసామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రుణమాఫీ జరగలేదన్నారు. ఫించన్లను భారీగా పెంచామని చెప్పారు.

 

నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ నిరంతరం అందుతున్నది కాబట్టే ప్రజలు ప్రభుత్వాన్ని మరచిపోయారంటూ చమత్కరిచారు.

 

పథకాల గురించి ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే, రుణమాఫీ అన్నది కేంద్రప్రభుత్వ పథకం కాదు. గడచిన ఎన్నికల్లో గట్టెక్కేందుకు చంద్రబాబు ఇచ్చిన హామీ. అధికారంలోకి వచ్చారు కాబట్టి చంద్రబాబు మాత్రమే నెరవేర్చాల్సిన హామీ. ఈ హామీకి మిగిలిన రాష్ట్రాలకు ఏమీ సంబంధం లేదు.

 

అలాగే, విద్యుత్ కూడా కేంద్రప్రభుత్వ పుణ్యాన 24 గంటలూ సరఫరా అవుతోంది. ఎందుకంటే, చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన రెండున్నరఏళ్ళల్లో ఒక్క విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కూడా ఏర్పటు కాలేదు. ఇపుడు పనిచేస్తున్న కేంద్రాలన్నీ గత ప్రభుత్వ హయాంలో ఏర్పడినవే.

 

ఇక, సామాజిక ఫించన్ల విషయానికి వస్తే, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫించన్ల పథకంలో కేంద్రప్రభుత్వం చెల్లిస్తున్న వాటానే ఎక్కువ. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా జరిగేది అదే. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా లబ్దిదారులకు అందుతుంది కాబట్టి తమకు జరిగే లబ్ది రాష్ట్రప్రభుత్వ నుండే అందుతోందని అనుకుంటారు. మొత్తం మీద చంద్రబాబు పాల్గొన్న జన్మభూమి కార్యక్రమం ఎన్నికల సభలాగే జరుగుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios