మళ్లీ పాదయాత్ర చేస్తా, పోలీసుల అనుమతి తీసుకునేది లేదు : ముద్రగడ పద్మనాభం
బెదిరింపులకు అంత ఈజీగా అదరని కాపు రిజర్వేషన్ పోరాట నాయకుడు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ధిక్కార స్వరం మళ్లీ వినిపిస్తున్నారు.
తన గహనిర్బంధం వల్ల ఆగిపోయిన కాపు సత్యాగ్రహ పాద యాత్రను జనవరిలో ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు, ఈ యాత్ర కు పోలీసులు చెబుతున్నట్లు అనుమతి తీసుకునే ప్రసక్తేలేదని చెప్పారు.
కాపు రిజర్వేషన్ల ఉద్యమాన్ని పున:ప్రారంభించాలని ఆయన నిర్ణయించారు. ఈ సారి ఉద్యమం నాలుగు దశల్లో సాగుతుందని చెబుతూ ఈ రోజు పోరాట కార్యాచరణ ప్రకటించారు.
గత నెలలో ఆయన ప్రారంభించిన కాపు పాదయాత్రను ప్రభుత్వం అడ్డుకున్న సంగతి తెలిసిందే. గృహనిర్బంధం వల్ల పాదయాత్ర ఆగిపోయినా ఉద్యమం ఆగదని ఆయనచెప్పారు. ఇపుడు కార్యాచరణ ప్రకటించారు.
మొదటి దశలో డిసెంబర్ 18న కాపులంతా నల్ల రిబ్బన్లు కట్టుకుని గరిటతో కంచాన్ని కొడుతూ నిరసన తెల్పుతారు.
రెండువ అంచెలో డిసెంబర్ 30న కాపు నేతలు,ప్రజలతో కలసి ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు ఇస్తారు.
2017 జనవరి 8న కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహిస్తారు.
జనవరి 25న కాపు సత్యాగ్రహ యాత్ర చేపడతామని, దీనికి ఎటువంటి అనుమతి తీసుకోబోమని స్పష్టం చేశారు. శుక్రవారం జరిగిన కాపు జేఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
నవంబర్ 16 నుంచి 21 వరకు ముద్రగడ ఆధ్వర్యంలో కాపు ఉద్యమకారులు సత్యాగ్రహ పాదయాత్ర చేపట్టాలని భావించినా, పోలీసులు ఆయన్ను గృహనిర్బంధంలో ఉంచడంతో ఈ యాత్ర ఆగిపోయింది. ఈ యాత్ర సందర్బంగాపోలీసులు కిర్లంపూడి ప్రాంతంలో నిషేధాజ్ఞలు విధించారు. యాత్రకు పోలీసుల అనుమతి లేదని చెప్పారు. అయితే, యాత్రకు పోలీసుల అనుమతి అవసరం లేదని చెబుతూ యాత్రా స్వేచ్ఛ కోసం హైకోర్టును అశ్రయించారు. కోర్టు పాదయాత్రను అనుమతించింది. అయితే, పోలీసులను ఆయనను హౌస్ అరెస్టు చేసి యాత్రను అడ్డుకోగలిగారు. అయితే, ఆయన నిర్బంధానికి వెరవకుండాయాత్రను మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించారు.
