భారత క్రికెట్‍ జట్టు మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని మళ్లీ చెన్నై జెర్సీని ధరించనున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మళ్లీ చెన్నై జెర్సీని ధరించనున్నారు. వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ధోని ఆడటానికి మార్గం సుగమమైంది. ఈ మేరకు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ బుధవారం ఆమోదం తెలిపింది.
నిబంధనల ప్రకారం ప్రతి ఏటా ఐపీఎల్లో ఆడే ఆటగాళ్లకు వేలం నిర్వహిస్తారు. ఇందులో తమకు కావాల్సిన వారిని ఫ్రాంచైజీలు కొనుగోలు చేసుకుంటాయి. అయితే, ఐదుగురు ఆటగాళ్లను మాత్రం వేలానికి వెళ్లకుండా ఉంచుకునేందుకు ఫ్రాంచైజీలకు అవకాశం ఇచ్చారు. ఈ నిబంధన కారణంగా 2018లో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు పూర్వం తమ తరఫున ఆడిన ఆటగాళ్లను మళ్లీ తెచ్చుకునేందుకు వీలు కలిగింది.
అదే విధంగా ఫ్రాంచైజీలకు చెల్లిస్తున్న మొత్తాన్ని రూ. 66 కోట్ల నుండి రూ. 80 కోట్లకు పెంచాలని కూడా నిర్ణయమైంది. పనిలో పనిగా ఆటగాళ్ళకు అందుతున్న మొత్తాలను కూడా పెంచేందుకు గవర్నింగ్ కౌన్సిల్ ఆమొదం తెలిపింది.
2013 సీజన్లో సీఎస్కే, ఆర్ఆర్ జట్ల ఓనర్లు బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్కి పాల్పడినట్లు రుజువు కావడంతో ఆ రెండు జట్లను రెండేళ్ల పాటు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ మధ్యే ఈ జట్లపై ఉన్న నిషేధం పూర్తి కావడంతో చెన్నై, రాజస్థాన్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు. అయితే ఐపీఎల్లో హాట్ ఫేవరెట్ జట్టు అయిన సీఎస్కేకు తిరిగి ఐపీఎల్లో ఆడే అవకాశం దక్కటమే కాకుండా జట్టుకు మరోసారి ధోనినే సారధ్యం వహించే అవకాశం ఉండటంతో చెన్నై అభిమానుల్లో మరింత ఆనందం కనబడుతోంది.
