‘తమ అధినేత ఆదేశిస్తే తక్షణమే రాజీనామాలు చేసేస్తాం’.. ఇవి మన ఎంపిలు చెబుతున్న మాటలు. కేంద్ర బడ్జెట్ తర్వాత ఈ మాటలు ఇంకా ఎక్కువయ్యాయి. మొన్నటి వరకూ వైసిపి ఎంపిలు మాత్రమే పై విధంగా చెప్పేవారు. ఇపుడు వారికి టిడిపి ఎంపిలు కూడా తోడయ్యారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపికి పూర్తిగా అన్యాయం జరిగిందన్నది వాస్తవం. అంటే గడచిన నాలుగు బడ్జెట్లలో కేంద్రం ఏపికేదో ఊడబీకిందని కాదు. ప్రతీ బడ్జెట్లోనూ ఇదే తంతు.

కాకపోతే పోయిన బడ్జెట్లకు తాజా బడ్జెట్ కు తేడా ఉంది. మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్టే ఎన్నికల ముందు చివరి బడ్జెట్. ఏపికి కేంద్రం నుండి వచ్చేదేమీ లేదని ఈ బడ్జెట్ తో తేలిపోయింది. రేపటి ఎన్నికల్లో జనాలను ఓట్లడగటానికి వెళ్ళినపుడు ఎవరైనా నిలదీస్తే ఏమని సమాధానం చెప్పాలి. పోయిన ఎన్నికల్లో రాష్ట్రానికి ఏదో ఊగబొడిచేస్తానని చెప్పిన మాటలను, చేసిన హామీలను నమ్మి జనాలు చంద్రబాబుకు ఓట్లు వేశారు. కానీ జరిగిందేంటో అందరికీ తెలిసిందే.

ఇదే పరిస్ధితి ఏ తమిళనాడులోనో జరిగుంటే పరిస్ధితి ఈ పాటికి వేరే విధంగా ఉండేదనటంలో సందేహమే లేదు. రాష్ట్రం భగ్గున మండిపోయేదే. ఒళ్ళు మండిన జనాలు దొరికిన ప్రజాప్రతినిధులను తరిమి తరిమి కొట్టేవారు. రాష్ట్రంలోని మంటలకు కేంద్రం ఉడికిపోయేదే. దెబ్బకు దిగివచ్చేదే. దానికితోడు రాష్ట్రాభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులందరూ ఏకతాటిపై నడుస్తారని గతంలో ఎన్నోసార్లు రుజువైంది. రాష్ట్రంలో పార్టీల మధ్య వైరుధ్యాలెన్ని ఉన్నా కేంద్రం దగ్గర మాత్రం ఎంపిలందరూ ఒక్కటే. మరి, అంతటి పట్టుదల, కట్టుబాటు మన రాష్ట్రం ఎంపిల్లో ఏది?

మూడున్నరేళ్ళుగా ఏపి విషయంలో కేంద్రం వైఖరి,  చంద్రబాబు డ్రామాలూ అందరూ చూస్తున్నదే. దానికి కొనసాగింపే తాజాగా టిడిపి ఎంపిల రాజీనామా డ్రామా.

అందుకనే తమకు పదవులు ముఖ్యం కాదని ఎంపిలతో చెప్పిస్తున్నారు.  తమ అధ్యక్షుడు ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు మంత్రిపదవులకు రాజీనామాలు చేసేస్తామంటూ కేంద్రమంత్రి సుజనా చౌదరి చెప్పటం గమనార్హం. అంతేకానీ కేంద్రం చేస్తున్న అన్యాయానికి నిరసనగా ఎంపి పదవులకు రాజీనామాలు కూడా చేయటానికి ఇష్టపడటం లేదన్న విషయం అర్దమైపోతోంది. అధికారంలో ఉన్న ఎంపిలే రాజీనామాలు చేయనపుడు వైసిపి ఎంపిలు మాత్రం ఎందుకు రాజీనామాలు చేస్తారు?