న్యూడిల్లి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అతి త్వరలోనే రాష్ట్రపతి పాలనలోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని ఎంపీ రఘురామ కృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసిపి ప్రభుత్వం ప్రస్తుతం చేపట్టిన చట్ట వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక చర్యలను కేంద్రం చూస్తూ ఊరుకోదని... తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని తొలగించి రాష్ట్రపతి పాలనను విధిస్తారని అన్నారు. 

వైసిపి ప్రభుత్వం ఇప్పటికే శాసన, కార్యనిర్వహక వ్యవస్థలను నాశనం చేసిందని... ఇప్పుడు న్యాయ శాఖపై పడిందన్నారు. న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేసేలా జగన్ సర్కార్ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేవలం తనపై వున్న కేసుల నుండి బయటపడేందుకే ముఖ్యమంత్రి రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్నారని...  ఇది ఆర్టికల్ 356 మేరకు రాష్ట్రపతి పాలనకు దారితీస్తున్నాయని రఘురామ పేర్కొన్నారు. 

read more   నన్ను అరెస్టు చేయించేంత వరకు జగన్ అన్నం ముట్టరట: రఘురామ

ఇక గత రెండు రోజులుగా రఘురామ కృష్ణంరాజు ఫోటో ఒకటి విపరీతంగా  అవుతుంది. ఆయన నోట్లో ఒక విదేశీ యువతి షాంపేన్ పోస్తున్న ఫోటోతో గత రెండు రోజులుగా ఆయనను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీ అభిమానులు ఆయనపై విరుచుకుపడుతున్నారు. ఈ తరుణంలో రఘురామకృష్ణంరాజు ఈ ఫోటోపై క్లారిటీ ఇస్తూ... ఇందులో ఉన్నది తానే అని ఒప్పుకుంటూ... జగన్ సర్కార్ మద్యం పాలసీ పై సెటైర్లు వేశారు. 

షాంపేన్ ని క్రికెటర్లు కూడా తాగుతారన్న రఘురామ.... అందులో తప్పేమిటని ప్రశ్నించారు. ఆ ఫొటోలో తానేమి అసభ్యంగా ప్రవర్తించలేదని, ఆ అమ్మాయిని ఎక్కడ తాకలేదని అన్నారు. నోట్లో పోసినంత మాత్రాన అదేదో తప్పు చేసినట్టు కాదని, ఈ ఫొటోతో ఉన్మాదుల్లా రెచ్చిపోయారు అంటూ ఆయన ఫైర్ అయ్యారు. 

వైసీపీ వారు ఇచ్చే పార్టీల్లో కూడా రష్యన్ అమ్మాయిలు ఉంటారంటూ రఘురామ చురకలు అంటించారు. "ఏముంది ఆ ఫోటోలో.. మీరు సప్లై చేసే ప్రెసిడెంట్ మెడల్, నోబెల్ ప్రైజ్ వంటి చెత్త డ్రింకులు తాగకుండా షాంపైన్ నోట్లో పోసుకుంటే బాధగా ఉందా?" అంటూ వైసీపీ ప్రభుత్వ మద్యం విధానంపై వెటకారంగా పంచులు వేశారు. 

ఆ ఫోటో తనదేనని ఒప్పుకోవడానికి తాను సిగ్గు పడాల్సిన అవసరం లేదని, తానేమి తప్పు చేయలేదని అన్నారు రఘురామకృష్ణంరాజు. ఒక తెలుగు  పార్టీలో తీసిన ఫోటో ఇది అని, రెండు మూడు సంవత్సరాల కిందటిది ఈ ఫోటో అని తెలిపారు. 

ఈ ఫోటోను ఎవరు బయటపెట్టిఉంటారో కూడా తనకు తెలుసునని, బహుశా సుబ్బారెడ్డిగారు ఈ ఫోటోను బయటపెట్టి ఉంటారని అన్నారు రఘురామ. తనకు కొన్ని అసభ్యకరమైన మెసేజ్ లు,బెదిరింపులు వస్తున్నాయని, దీనిపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసానని తనను అగౌరవపరిచినవారు జైలు ఊచలు లెక్కపెట్టాల్సిందేనని వార్నింగ్ సైతం ఇచ్చారు కృష్ణంరాజు.