న్యూఢిల్లీ: తనను అరెస్టు చేయించడాన్నే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారని వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణమ రాజు ఆరోపించారు. ఆదివారంనాడు ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించడంలో ప్రవీణ్ ప్రకాశ్ అనే అధికారి కీలక పాత్ర పోషించారని ఆయన అన్నారు.

తన బ్యాచ్ మేట్ తో పావులు కదిపి ప్రవీణ్ ప్రకాశ్ తనపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించడంలో విజయం సాధించారని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యనటలో రాష్ట్ర సమస్యలను గాలికి వదిలేశారని రఘురామకృష్ణమ రాజు విమర్శించారు

తనను అరెస్టు చేయించే వరకు అన్నం కూడా తినేలా లేరనే మంకు మంకు పట్టుదలతో జగన్ ఉన్నట్లు తాడేపల్లి వర్గాల నుంచి సమాచారం అందుతోందని ఆయన అన్నారు. సీబీఏ కేసుల నుంచి బయట పడేందుకే జగన్ ప్రవీణ్ ప్రకాష్ ను తెచ్చుకున్నారని ఆయన ఆరోపించారు. 

ప్రవీణ్ ప్రకాశ్ ముఖ్యమంత్రికి రక్షకుడిగా ఉంటారో, తక్షకుడిగా ఉంటారో చూడాలని ఆయన అన్నారు. న్యాయవ్యవస్థపై దాడులు జరుగుతున్నాయని, ఈ రకంగా దాడికి పాల్పడడం అశుభ పరిణామమని ఆయన అన్నారు. ఆర్టికల్ 356 దిశగా ప్రయాణం చేసేలా ఉందని ఆయన అన్నారు. త్వరలోనే చెడుపై మంచి విజయం సాధించి ప్రజలకు న్యాయం జరుగుతుందని, ఆ రోజు వస్తుందని ఆశిస్తున్నానని రఘురామ కృష్ణమ రాజు అన్నారు.