చెడు అలవాట్లకు బానిసై రోజూ ఇబ్బంది పెడుతున్నాడని ఓ తల్లి తన సొంత కొడుకుపైనే దాడి చేసింది. కత్తితో కొడుకు పీక కూడా కోసేసింది. ఈ దారుణ సంఘటన విశాఖపట్నంలోని ఆరిలోవ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... జీవీఎంసీ ఒకటో వార్డు పరిధి ఆరిలోవ నాలుగో సెక్టార్ ఎర్నిదుర్గానగర్ లో కలిమి గాటిలక్ష్మి, మచ్చిరాజు దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ముగ్గురు కుమారులు. మూడో కుమారుడైన రమేష్(21) మద్యం, గంజాయి, ఇతర చెడు అలవాట్లకు బానిసగా మారాడు.

Also Read నైట్ క్లాసుల పేరుతో నంద్యాల స్కూల్‌లో విద్యార్థులపై వికృత చేష్టలు...

నిత్యం డబ్బుల కోసం తల్లిదండ్రులను వేధించేవాడు. అతని వేధింపులు రోజు రోజుకీ ఎక్కువైపోయాయి. కాగా... శుక్రవారం సాయంత్రం ఇంటికి వచ్చిన  రమేష్ రూ.500 కావాలని తల్లిని అడిగాడు. తన వద్ద లేవని తల్లి ఎంత చెప్పినా అతను వినిపించుకోలేదు.

అయినా వినిపించుకోకుండా.. తాగిన మత్తులో తల్లిపై కూడా దాడి చేయడానికి ప్రయత్నించాడు. దీంతో.. ఆమె తట్టుకోలేకపోయింది. కత్తితీసుకొని కొడుకు మెడ కోసేసింది. అతని అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి పరుగులు తీసి రమేష్ ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు  చెప్పారు.