కర్నూల్:కర్నూల్ జిల్లా నంద్యాలలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో నైట్ క్లాస్ పేరిట విద్యార్ధులపై వికృత చేష్టలకు పాల్పడుతున్న ముగ్గురు టీచర్లపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ స్కూల్ ను సీజ్ చేయాలని బాధిత విద్యార్ధుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Also read:స్టాప్ నర్సుపై లైంగిక దాడి: పీఎస్‌ నుండి తప్పించుకొన్న డాక్టర్, గత చరిత్ర ఇదీ...

పదో తరగతి పరీక్షలు సమీపిస్తున్నందున రాత్రి పూట 9 గంటల నుండి 11 గంటల వరకు విద్యార్థులకు స్కూల్ లోనే నైట్ క్లాసులు నిర్వహిస్తున్నారు. నైట్ క్లాసుకు వచ్చే విద్యార్థులతో ముగ్గురు టీచర్లు వికృత చేష్టలకు పాల్పడుతున్నారని బాధిత విద్యార్థులు తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు.

నైట్ క్లాసులకు హాజరయ్యే విద్యార్థులపై వికృత చేష్టలకు పాల్పడుతూ సెల్ ఫోన్లలో రికార్డు చేస్తున్నారు. మరునాడు ఆ వీడియోలను స్కూల్లో ఇతర విద్యార్థులకు చూపించి హేళన చేస్తున్నారు. టీచర్ల ఆగడాలు శృతి మించిపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు గురువారం నాడు రాత్రి నంద్యాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు టీచర్లపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. స్కూల్ ను కూడ సీజ్ చేయాలని బాధిత తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులకు విద్యాబోధన చేయకుండా వికృత చేష్టలకు దిగిన టీచర్లను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.