అమరావతి: గ్రామీణ ప్రాంతాలలో ఉద్యోగ కల్పనపై కసరత్తు చేస్తున్నట్లు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. ఏపీలో  'రిమోట్ వర్క్' కాన్సెప్ట్ అవకాశాలపై అధ్యయనం చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. 

నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ, ఐఎస్‌బీ ప్రతినిధులతో మంత్రి గౌతమ్ రెడ్డి సమీక్షా సమావేశం చేపట్టారు. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని తన కార్యాలయ నుంచే మంత్రి అధికారులు, ఐఎస్‌బీ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై చర్చించారు. కోవిడ్-19 నేపథ్యంలో స్వగ్రామం, స్వస్థలాలలో ఉద్యోగాలను కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు. 

పరిశ్రమ, కంపెనీ ఎక్కడున్నా ఇంటి నుంచే విధులు నిర్వర్తించడాన్ని 'రిమోట్ వర్క్' కాన్సెప్ట్ అంటారని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పరిశ్రమలలో 'రిమోట్ వర్క్' కు ఉన్న అవకాశాలపై పరిశీలన జరుపుతున్నాయన్నారు. రిమోట్ వర్క్ కు అనుగుణంగా ఇంట్లోంచి విధులు నిర్వర్తించగల 'నైపుణ్యం'పైనా అధ్యయనం చేయాలని మంత్రి సూచించారు. 

read more   పేదల ఇళ్ల స్థలాల పంపిణీ: జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

స్థానికంగా ఉన్న యువతకు ఇతర ఉపాధి అవకాశాలపైనా దృష్టి పెట్టాలని ఆదేశించారు. పరిశ్రమలలో ఉద్యోగాలు, గ్రామీణ యువత ఆలోచనలను అధ్యయనం చేసే బృందం ఏర్పాటు చేయాలని సూచించారు. పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ, ఐఎస్‌బీలతో కలిపి బృందం ఏర్పాటు చేయాలన్నారు. పరిశ్రమల శాఖ, నైపుణ్యశాఖల నుంచి ఒక్కొకరు నోడల్ అధికారిగా నియామించాలని మంత్రి అన్నారు. 

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో  నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాము, పరిశ్రమల శాఖ కమిషనర్ సుబ్రహ్మణ్యం జవ్వాది, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ అర్జా శ్రీకాంత్,  ఐ.టీ సలహాదారులు లోకేశ్వర్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హనుమ నాయక్ తదితరులు పాల్గొన్నారు.