తన భర్తది ముమ్మాటికే రాజకీయ హత్యేనని అన్నారు హత్యకు గురైన వైసీపీ నేత మోకా భాస్కరరావు భార్య వెంకటేశ్వరమ్మ. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇంతకు తెగిస్తాడని తాము అనుకోలేదని ఆమె వాపోయారు.

రాజకీయంగా ఎదగడం ఓర్వలేకే హత్య చేయించారని వెంకటేశ్వరమ్మ ఆరోపించారు. కొల్లు రవీంద్ర అక్రమాలను భాస్కరరావు మొదటి నుంచి ప్రశ్నించేవారని ఆమె చెప్పారు. గూటాల చెరువు భూముల అమ్మకంపై భాస్కరరావు పోరాటం చేశారని వెంకటేశ్వరమ్మ తెలిపారు.

Also Read:నేరస్తులే పాలకులైతే నిరపరాధులంతా జైలుకే...: రవీంద్ర అరెస్ట్ పై టిడిపి నేతల ఆగ్రహం

తన భర్త హత్య వెనుక ఎంతటి వారున్నా వారిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. మత్స్యకారుల కుటుంబాలకు ఏం జరిగినా భాస్కరరావు ముందుండేవారని వెంకటేశ్వరమ్మ చెప్పారు.

హత్యకు పాల్పడిన నిందితులు కూడా తమకు పరిచయమున్న వ్యక్తులేనని వారికి సాయం కూడా చేశామని ఆమె గుర్తుచేశారు. మరోవైపు మోకాది రాజకీయ హత్య కాదన్నారు మాజీ ఎంపీ కొనకళ్ల సత్యనారాయణ.

Also Read:కొల్లు రవీంద్ర అరెస్ట్.. జగన్ రాక్షసానందమంటున్న లోకేష్

కొల్లు రవీంద్రను అన్యాయంగా ఇరికించారని.. కుటుంబ తగాదాలతో జరిగిన హత్యను పక్కదారి పట్టించారని ఆయన ఆరోపించారు. ముద్దాయిలు పేరు చెబితే విచారణ కూడా చేయరా అని కొనకళ్ల ప్రశ్నించారు. కొల్లు హత్యా రాజకీయాలు చేసే వ్యక్తి కాదన్నారు.