Asianet News TeluguAsianet News Telugu

నేరస్తులే పాలకులైతే నిరపరాధులంతా జైలుకే...: రవీంద్ర అరెస్ట్ పై టిడిపి నేతల ఆగ్రహం

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్ పై స్పందిస్తూ ప్రతిపక్ష బిసి నాయకులపై ప్రభుత్వం అణచివేత దోరణిని అవలంభిస్తోందని టిడిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

TDP Leaders Reacts on Kollu Ravindra Arrest
Author
Amaravati, First Published Jul 4, 2020, 11:27 AM IST

గుంటూరు: మంత్రి పేర్ని నాని అనుచరుడు, మచిలీపట్నం వైసిపి నేత మోకా భాస్కరరావు హత్యకేసులో మాజీ మంత్రి, టిడిపి నాయకులు కొల్లు రవీంద్రను శుక్రవారం రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు.  అయితే ఈ అరెస్ట్ పై స్పందిస్తూ ప్రతిపక్ష బిసి నాయకులపై ప్రభుత్వం అణచివేత దోరణిని అవలంభిస్తోందని టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రవీంద్ర అరెస్ట్ పై పలువురు టిడిపి సీనియర్ల స్పందన కింది విధంగా వుంది. 

మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి

''అసమర్థ పాలనను ప్రశ్నించే ప్రతిఒక్కరిని అక్రమ అరెస్ట్ లతో బెదిరించడమే లక్ష్యంగా వైసిపి ప్రభుత్వం పనిచేస్తోంది. రాజకీయ జీవితంలో ఏ మచ్చలేని కొల్లు రవీంద్రను అరెస్టు చేయడం జగన్మోహన్ రెడ్డి నియంత పోకడలకు నిదర్శనం. సీఎం తన అధికారాన్ని కేవలం కక్ష సాధింపుల కోసం వినియోగించుకోవడం దుర్మార్గం. నేరస్తులే పాలకులైతే నిరపరాధులంతా జైలుకు వెళతాని కొల్లు రవీంద్ర అరెస్టుతో మరోసారి స్పష్టమైంది. కనీసం ప్రాథమిక విచారణ లేకుండా కొల్లు రవీంద్రను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం. ఇప్పటికైనా బడుగు బలహీన వర్గాల నేతలపై ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను విడనాడాలి'' అని సూచించారు. 


డోలా వీరాంజనేయ స్వామి

బీసీల గొంతు కోయడమే ధ్యేయంగా జగన్ పాలన సాగుతోంది. కొల్లు రవీంద్ర అరెస్టు ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యే. రాష్ట్రంలో బలమైన బీసీ నాయకులను అక్రమ కేసుల్లో ఇరికించి ఇబ్బందులు పెట్టే దుర్మార్గ ఎత్తుగడ సాగుతోంది. అందుకు నేటి కొల్లు రవీంద్ర అరెస్టు తాజా ఉదాహరణ. రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవకు సంభందించిన ఘటనలో మాజీ మంత్రికి ఎంటి సంబంధం? వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు, దాడులు, దౌర్జన్యాలు, దోపిడీలు తప్ప ఇంకేమీ లేవు. ప్రజల సమస్యలపై నిలదీసే వారిని అక్రమ కేసుల్లో ఇరికించి ఇబ్బందులు పడుతున్నారు. జగన్ రెడ్డి పాలనలో అభివృధి అనేదే లేదు. పాలన చేత కాక ప్రతిపక్షాన్ని ఇబ్బందులు పెట్టడం తుగ్లక్ చర్యే. ఇలాంటి కక్ష సాధింపులకు తగిన మూల్యం తప్పదని జగన్ రెడ్డి గుర్తుంచుకోవాలి'' అని హెచ్చరించారు. 

ఎమ్మెల్సీ బుద్దా నాగ జగదీశ్వర రావు

''రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ను అరెస్టు చేయడం ప్రభుత్వ కుట్రకు, కక్ష సాధింపు చర్యలకు నిదర్శనం. బడుగు బలహీనర్గాలకు చెందిన నాయకులపై అక్రమ కేసులు నమోదు చేయడం ముమ్మాటికీ కక్ష సాధింపు. పెళ్లికి వెళ్లారని యనమల రామకృష్ణుడు పై, లెటర్ ఇచ్చారని అచ్చెన్నాయుడు ను, ఫోటో ఎందుకు తీశారని అడిగినందుకు అయ్యన్న పాత్రుడు పై అక్రమ కేసులు పెట్టారు. జగన్ రెడ్డి ఏడాది పాలనలో అవినీతికి పాల్పడటం, అక్రమ కేసుల్లో ఇరికించి ఇబ్బందులు పెట్టడం తప్ప సాధించింది ఏమి లేదు. కోర్టుల్లో ఎదురు దెబ్బలతో ఫ్రస్ట్రేషన్ కు లోనయి కనిపించిన వారిపై కేసులు పెట్టి జగన్ రెడ్డి పైసాచిక ఆనందం పొందుతూ ఉన్నారు. మీ అప్రజాస్వామిక విధానాలకు త్వరలో చెల్లు చీటీ పడబోతోంది అని తెలుసుకోవాలి. కొల్లు రవీంద్ర సహా బడుగు బలహీనర్గాల నేతలపై పెట్టిన అక్రమ కేసులు ఉప సంహరించుకోవాలి'' అని అన్నారు. 
 
టిడిపి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ 

''మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పై అక్రమంగా హత్య కేసు పెట్టి అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.  ఆ కేసులో కొల్లు రవీంద్రకు ఎలాంటి సంబందం లేకపోయినా కేసు పెట్టడం దుర్మార్గపు చర్య. పాతకక్షల నేపద్యంలో హత్య జరిగితే దాన్ని రవీంద్రకు ఆపాదిస్తారా? టీడీపీ నాయకులు, కార్యకర్తలపై వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేసి వేదింపులకు గురి చేస్తోంది.  కాలం ఎప్పుడూ ఒకే లా ఉండదన్న విషయాన్ని పాలకులు గుర్తించాలి. అధికారం ఉంది కదా నియంతలా వ్యవహరించటం సరికాదు.  జగన్ టీడీపీ లోని బీసీ నాయకులని టార్గెట్ చేసి వేధిస్తున్నారు.  ముఖ్యమంత్రి జగన్ కక్షసాధింపు చర్యలు వీడి పాలనపై దృష్టి పెట్టాలి'' అని సూచించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios