Modi Amaravati Visit: ఏపీ రాజధాని అమరావతికి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఖరారు కావడంతో అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో మంత్రుల కమిటీని ఏర్పాటు చేశారు. మోదీ సభను సక్సెస్ చేయాలని వారికి సూచించారు. మే 2న జరగబోయే సభను గ్రాండ్‌గా నిర్వహించాలని అనుకుంటున్నారు. మొత్తం 250 ఎకరాలను సభకోసం కేటాయించి ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పార్కింగ్ కోసం 50 ఎకరాలకు పైగా కేటాయిస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. ప్రధాని వస్తుండటంతో ఆయన ఎలాంటి వరాలు ప్రకటిస్తారని రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ప్రధాని మోదీ సభకు కనీసం ఐదు లక్షల మంది జనాభా వచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లు గ్యాలరీలను ఏర్పాటు చేస్తున్నారు. మహిళలు కూడా పెద్దఎత్తున సభకు రానున్నారు. కూటమి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తుండటంతో మూడు పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలకు చెందిన కేడర్, పార్టీ శ్రేణులు భారీగా తరలించనున్నారు. మోదీ పర్యటనను ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే మంత్రుల కమిటీ ఏర్పాటు చేసి ఎవరి బాధ్యతలను వారికి అప్పగించారు. 
అమరావతి రాజధానికి తొలుత శంకుస్థాపన చేసింది ప్రధాని నరేంద్ర మోదీనే. టీడీపీ ప్రభుత్వ హయాంలో 2015లో ప్రధాని అమరావతికి వచ్చారు.. గంగానది నీటిని, మట్టిని తీసుకొచ్చి శంకుస్థాపన పనుల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత రాజధాని పనులు ప్రారంభించారు. అయితే.. 2019లో వైసీపీ అధికారంలోకి రావడంతో రాజధాని పనులు నిలిచిపోయాయి. గత ఏడాది మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని పనులు వేగవంతం అయ్యాయి. కేంద్రం కూడా నిధులు కేటాయించడం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రణాళికతో అమరావతి అభివృద్దికి అడుగులు వేస్తోంది.
మోదీ సభకు ఏపీ సెక్రటేరియట్ ప్రాంతంలో స్థలాన్ని ఎంపిక చేశారు. ప్రధానంగా సభ జరిగే డయాస్ వద్ద సుమారు 50 వేల మంది పట్టే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి కృష్ణ, గుంటూరు, ప్రకాశం, గోదావరి జిల్లాల నుంచి జన సమీకరణ చేపట్టేందుకు ఆ మేరకు నాయకులకు దిశానిర్దేశం చేశారు. ప్రధాని చంద్రబాబు, పవన్, లోకేష్, బీజేపీ నాయకులు రిసీవ్ చేసుకుని డయాస్ వద్దకు తీసుకురానున్నారు. ఇక సభా వేదిక నుంచే పలు అభివృద్ది కార్యక్రమాలకు మోదీ శంకుస్తాపనలు చేయనున్నారు.
గతంలో చంద్రబాబు రాజధానిలో తాత్కాలిక హైకోర్టు, సచివాలయం భవనాలు కట్టడంతో మాజీ సీఎం జగన్ రాజధాని మార్పునకు ప్రతిపాదించారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం.. శాశ్వత భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. సుమారు రూ.1500 కోట్లతో సచివాలయం, హైకోర్టు భవనాలను నిర్మించేందుకు ఇటీవల టెండర్లను పిలవగా.. రీసెంట్‌గానే ఈ ప్రక్రియ కూడా పూర్తి చేశారు. ఇక మోదీ చేతుల మీదుగా ఆ పనులను ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితోపాటు పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రధాని శంకుస్తాపన చేయనున్నారు.

వేసవి ఎండల నేపథ్యంలో సభకు పాల్గొనే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. వాటర్ ఫ్రూఫ్ టెంట్లు, తాగునీరు, మెడికల్ సదుపాయం ఇతర సౌకర్యాలను కల్పించాలని సూచించారు. ఇక ప్రధాని మోదీ అమరావతికి ఏ మేరకు నిధులు ఇవ్వనున్నారు. రాజధాని భవిష్యత్తు, రాష్ట్రనికి ఎలాంటి వరాలు ఇవ్వనున్నారు అన్నదానిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతోపాటు ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై మోదీ ఏమని స్పందిస్తారు? దీని స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు ఏమైనా ఇస్తారా అని ఎదురుచూస్తున్నారు.
