కడప: వైసీపీ నేత పరమేశ్వర్ రెడ్డి టీడీపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నాడని, ఈ విషయమై మధ్యవర్తుల ద్వారా తనను సంప్రదించినట్టుగా ఎమ్మెల్సీ బీటెక్ రవీంద్ర చెప్పారు. పరమేశ్వర్ రెడ్డి కుటుంబానికి తమ కుటుంబానికి మధ్య 10 ఏళ్లుగా ఫాక్షన్ గొడవలు ఉన్నట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు.మరోవైపు ఈ కేసులో తమ పాత్ర ఉందని తేలితే ఉరితీయాలని ఆయన కోరారు.

సోమవారం నాడు ఓ తెలుగు న్యూస్ ఛానెల్‌తో ఆయన మాట్లాడారు. పరమేశ్వర్ రెడ్డి సోదరుడిని 10 ఏళ్ల క్రితం ప్రత్యర్థులు హత్య చేశారని ఆయన చెప్పారు. ఈ కేసులో తనను కూడ చేర్చారన్నారు.  ఈ హత్యకు ప్రతీకారంగా తమ బాబాయ్ తో పాటు తమ దాయదిని పరమేశ్వర్ రెడ్డి వర్గీయులు హత్య చేశారని బీటెక్ రవి చెప్పారు. ఈ రెండు హత్య కేసుల్లో కూడ పరమేశ్వర్ రెడ్డి నిందితుడుగా ఉన్నాడని ఆయన చెప్పారు.

ఫ్యాక్షన్ వదిలేసి గ్రామాల్లో అభివృద్ధిని కొనసాగించాలని చంద్రబాబు చెబుతున్నాడని బీటెక్ రవి చెప్పారు. ఇదే సమయంలో పరమేశ్వర్ రెడ్డి టీడీపీలో చేరేందుకు వస్తే నీకేమైనా అభ్యంతరమా అంటూ కొందరు పెద్ద మనుషులు తనను సంప్రదించారని  బీటెక్ రవి తెలిపారు.  కానీ, ఈ విషయమై తన కుటుంబసభ్యులతో పాటు గ్రామ పెద్దలతో మాట్లాడి చెబుతానని నాలుగు రోజుల క్రితమే చెప్పినట్టుగా ఆయన గుర్తు చేసుకొన్నారు.

కానీ, ఈ లోపుగానే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురైనట్టుగా ఆయన తెలిపారు.పార్టీకి లాభం జరిగితే ఎవరినైనా తీసుకొనేందుకు అభ్యంతరం లేదని పార్టీ నాయకత్వం కూడ చెబుతున్న విషయాన్ని బీటెక్ రవి ప్రస్తావించారు.

పార్టీలో చేరే విషయమై తనతో పరమేశ్వర్ రెడ్డి మాట్లాడలేదన్నారు. వైసీపీలో ఆయనకు ఏ రకమైన ఇబ్బందులు ఉన్నాయో తనకు తెలియదన్నారు. వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయడం దారుణమైన ఘటనగా ఆయన అభివర్ణించారు.

వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజున శంకర్ రెడ్డి, గంగిరెడ్డిలు ఇంట్లోకి ఎవరూ రాకుండా బాత్‌రూమ్, బెడ్ రూమ్ క్లీన్ చేశారని ఆయన ఆరోపించారు. అసలు గుండెపోటుతో  వివేకానందరెడ్డి మృతి చెందారిన ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు.

రాజకీయంగా తమకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని భావించే హత్యను గుండెపోటుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి ఉండవచ్చని బీటెక్ రవి ఆరోపించారు.ఈ కేసులో పరమేశ్వర్ రెడ్డి ఉండి ఉంటే అతడిని ఎవరూ కూడ కాపాడలేరన్నారు.నిజంగా అతడికి ఈ కేసుతో సంబంధం లేకపోతే అతడిని ఎవరూ కూడ ఈ కేసులో ఇరికించే అవకాశం లేదన్నారు.

సంబంధిత వార్తలు

వైఎస్ వివేకా హత్య: ఇంటి గుట్టుపై పరమేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ప్రాణాలిచ్చేవాడినే కానీ, తీసేవాడిని కాదు: వైఎస్ వివేకా హత్యపై పరమేశ్వర్ రెడ్డి

వైఎస్ వివేకా హత్య: అదృశ్యం కాలేదన్న పరమేశ్వర్ రెడ్డి

వైఎస్ వివేకా హత్య: పరమేశ్వర్ రెడ్డి కోసం సిట్ గాలింపు