గుంటూరు: తమిళనాడు చెక్ పోస్ట్ వద్ద పట్టుబడిన ఐదున్నర కోట్ల సొమ్ము వ్యవహారంలో తన ప్రమేయం లేనప్పుడు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎందుకంతలా కంగారు పడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు ప్రశ్నించారు. 

గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ...15వ తేదీ అర్థరాత్రి గుమ్మడిపూండి చెక్ పోస్ట్ వద్ద ఆరంబాక్కమ్ పోలీసులు నగదు ఉన్న వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారని, ఆ వాహనంపై ఉన్న స్టిక్కర్ తనదే అయినప్పటికి తనకు తెలియకుండా ఎవరో కలర్ జిరాక్స్ తీసి అంటించుకున్నారని మంత్రి బాలినేని చెప్పడం జరిగిందన్నారు. ఆ మర్నాడే ఆ స్టిక్కర్ నాది కాదు...వేరే వాళ్లదని చెప్పడం,  ఆ వాహనానికి తనకు సంబంధం లేదనడం విచిత్రంగా ఉందన్నారు. బాధ్యతగల మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి పూటకో రకంగా మాట్లాడటం, పొంతన లేని సమాధానాలు చెప్పడం చూస్తుంటే ఆయన వ్యక్తిత్వంపై అనుమానం కలుగుతోందని అశోక్ బాబు అభిప్రాయపడ్డారు. 

ఐదున్నరకోట్ల నగదు కరోనా సమయంలో బంగారం వ్యాపారి తీసుకెళ్లడం సక్రమమో, అక్రమమో కూడా ఆలోచన లేకుండా మంత్రి మాట్లాడటం ఏమిటన్నారు. మంత్రిది కానివ్వండి లేదా అధికారపార్టీ ఎమ్మెల్యేది కానివ్వండి వారికి చెందిన స్టిక్కర్ బయటి వ్యక్తులు ఎలా తమ వాహనాలకు అంటించుకుంటారో చెప్పాలన్నారు. అదికూడా పొరుగురాష్ట్రం రిజిస్ట్రేషన్ తో ఉన్న వాహానానికి ఆ స్టిక్కర్ ఎలా అంటించారో...ఎవరు ఎవరి ప్రమేయంతో అంటించారో చెప్పాలని టీడీపీ నేత డిమాండ్ చేశారు. 

15వ తేదీ అర్థరాత్రి నగదు పట్టుబడిన వాహనం అక్కడ ఉండగానే వేరే వాహానంలో భారీ నగదుతో మంత్రి కొడుకు అక్కడనుంచి వెళ్లిపోయినట్టుగా తమిళ మీడియాలో వచ్చిన కథనాలపై మంత్రి ఏం సమాధానం చెబుతారో చెప్పాలన్నారు. కరోనా సమయంలో మంత్రి అనుచరుడైన బంగారం వ్యాపారి అంతపెద్దమొత్తం నగదు ఎందుకు తీసుకెళ్లాడో... బంగారం దుకాణాలు అన్నీ మూసి ఉంటే ఎక్కడ వ్యాపారంచేయడానికి వెళ్లాడో చెప్పాలన్నారు.  

read more   బాలినేని కారులోనే ఐదున్నర కోట్లు...ఇక ముందున్న వ్యాన్ లో..: దేవినేని ఉమ

విశాఖపట్నంలో జరిగిన ప్రమాదాలకు చంద్రబాబే కారణమని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మాట్లాడినంత దిగజారుడుతనంగా తాము మాట్లాడటం లేదన్నారు అశోక్ బాబు. మంత్రి బాలినేని తన చిత్తశుద్దిని, తనపై వచ్చిన ఆరోపణల్లోని వాస్తవాలను నిరూపించుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. వైసీపీ నేతల్లా విలువలు లేకుండా, సంస్కారహీనంగా మాట్లాడటం తమకు చేతగాదన్నారు అశోక్ బాబు. పట్టుబడిన నగదుకు సంబంధించి వస్తున్న ఆరోపణలకు, తనకు ఉన్న సంబంధమేమిటో మంత్రే బయటపెట్టాలన్నారు. 

ఐదున్నరకోట్లు  తరలిస్తున్న వేరే రాష్ట్రానికి చెందిన వాహనానికి ఎమ్మెల్యే స్టిక్కర్ ఎందుకు అంటించారో, ఎవరు అంటించారో చెప్పాలన్నారు. ఆరోపణలు వచ్చిన మంత్రి సమాధానం చెప్పకుండా ఇతర వైసీపీ నేతలు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారో చెప్పాలని అశోక్ బాబు డిమాండ్ చేశారు. 

టీడీపీ ఎంపీలు రాష్ట్రపతిని కలిస్తే అంబటి రాంబాబుకు ఉన్న భయమేమిటో, ఆయనెందుకు అంతలా విపరీతంగా స్పందిస్తున్నారో తెలియడం లేదన్నారు. టీడీపీ ఎంపీలు చెప్పినవి అబద్ధాలే అయితే రాంబాబు ఎందుకు అంతలా భయపడుతున్నారన్నారు. కారులోని వ్యక్తులు పట్టుబడిన నగదు రాష్ట్ర మంత్రిదేనని చెప్పినా బుకాయింపులతో వాస్తవాలను దాచాలని చూడటం, ప్రజలను మభ్యపెట్టాలనుకోవడం వైసీపీ నేతలకు ఎంతమాత్రం మంచిదికాదని అశోక్ బాబు హితవు పలికారు.