Asianet News TeluguAsianet News Telugu

బాలినేని కారులోనే ఐదున్నర కోట్లు...ఇక ముందున్న వ్యాన్ లో..: దేవినేని ఉమ

జగన్ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్రంలోని సహజవనరులను దోచుకుంటూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని... ఇందుకు తమిళనాడులో  పట్టుబడిన సొమ్మే నిదర్శనమని మాజీ మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు. 

devineni uma demands dismissal of minister balineni after seizure of Rs 5.5 crores
Author
Vijayawada, First Published Jul 16, 2020, 7:56 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

విజయవాడ: జగన్ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు రాష్ట్రంలోని సహజవనరులను దోచుకుంటూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారని...దోచుకున్న దొంగసొమ్ముని దాచుకోవడానికి ఈ రాష్ట్రం చాలక పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్నారని టీడీపీనేత, మాజీ ఎమ్మెల్యే మంత్రి బొండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. 

గురువారం ఉమ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ పెద్దలుగా చెలామణి అవుతూ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ, అధికారులను తమ చెప్పుచేతుల్లో పెట్టుకొని, ప్రజల సొమ్మును అందినకాడికి దోచుకుంటున్న అవినీతిపరుల గురించి ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. ప్రతిపక్షాలపై తప్పుడు కేసులు పెడుతూ, ఆయా పార్టీలకు చెందిన వారిని జైళ్లకు పంపిస్తున్న ప్రభుత్వం వేలకోట్లు దోచుకుంటున్న ప్రభుత్వంలోని వ్యక్తులపై ఎందుకుచర్యలు తీసుకోవడం లేదన్నారు. దోచుకున్న సొమ్మును దాచుకోవడానికి ఇక్కడున్న డంపింగ్ యార్డులు సరిపోక, ప్రభుత్వపెద్దలు పక్క రాష్ట్రాలకు తమ అవినీతిసొమ్ముని తరలిస్తున్నారని ఉమా తెలిపారు. 

మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన కొడుకు, మంత్రి అనుచరులు గత కొద్దిరోజులుగా పెద్దఎత్తున డబ్బును తమ రాష్ట్రంలోకి తరలిస్తున్నారన్న అనుమానంతో నిఘా వేసిన తమిళనాడు పోలీసులకు పెద్దఎత్తున నగదు దొరికిందన్నారు. మంత్రి బాలినేని కొడుకు ఒక వ్యాన్ లో భారీగా నగదునింపి తీసుకెళ్లాడని, ఆయన వెనకాలే ఫార్య్చూనర్ వాహనంలో మంత్రి అనుచరులు తీసుకెళ్తున్న ఐదున్నర కోట్లను తమిళనాడుకి చెందిన ఆరంబాక్కమ్ పోలీసులు పట్టుకొన్నారని బొండా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంలోని అవినీతి సొమ్ము పొరుగు రాష్ట్రాలకు, ఇతర దేశాలకు తరలివెళుతోందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందన్నారు. అలా తరలిస్తున్న సొమ్ముని ఇతర రాష్ట్రాల్లోని మద్యం కంపెనీల్లో పెట్టుబడులుగా పెడుతున్నారని బొండా స్పష్టంచేశారు. 

ఏపీకి చెందిన హావాలా సొమ్ముని ఇతర రాష్ట్రాలకు తరలించి, అక్కడున్న అక్రమ మద్యాన్ని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అమ్ముతున్నారన్నారు.  ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, ఇళ్లస్థలాల మాఫియా, మద్యం మాఫియా లన్నీ కలిసి 14నెలల్లోనే రాష్ట్రవ్యాప్తంగా విశృంఖలంగా వ్యాపించాయన్నారు. ఆంధ్రా, తమిళనాడు సరిహద్దుల్లోని ఆరంబాక్కమ్ పోలీసులకు పట్టుబడిన ఐదున్నర కోట్ల హవాలా సొమ్ము మంత్రి బాలినేనిదే అని పోలీసులకు పట్టుబడిన ఆయన అనుచరులు చెప్పారని...దీనిపై వైసీపీ ప్రభుత్వం, వారి బ్లూమీడియా ఏం సమాధానం చెబుతుందో చెప్పాలన్నారు. 

read more  బ్లూ మీడియాలో గ్రాఫిక్స్ అంత ఈజీ కాదది: విజయసాయికి బుద్దా స్ట్రాంగ్ కౌంటర్

ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెడుతున్న ప్రభుత్వం 70ఏళ్ల వయసున్న అయ్యన్నపాత్రుడిపై నిర్భయ, రేప్ కేసులు పెట్టడం ఏంటని బొండా మండిపడ్డారు. టీడీపీలోని కీలకనేతలైన యనమల రామకృష్ణుడు, చినరాజప్పలపై ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదుచేశారన్నారు. రూ.5 రూపాయలు కూడా పట్టుబడకపోయినా అచ్చెన్నాయుడిని ఈఎస్ఐ స్కామ్ లో ఇరికించిన జగన్ ప్రభుత్వం ఐదున్నర కోట్ల సొమ్ముకి బాధ్యుడైన బాలినేనిని ఏం చేస్తుందో సమాధానం చెప్పాలని బొండా డిమాండ్ చేశారు. 

ఎవరికీ ఏహానీ చేయని కొల్లు రవీంద్రను కుట్రపూరితంగా హత్యాయత్నం కేసులో ఇరికించి రాజమండ్రి జైలుకు తరలించారన్నారు. టీడీపీ నేతలపై ప్రభుత్వ చర్యలను, అవినీతిని ప్రశ్నించారన్న అక్కసుతో రంగనాయకమ్మ, అనూష, నలంద కిశోర్ లపై అక్రమ కేసులు పెట్టారన్నారు. ప్రభుత్వమే సుప్రీం కాదనే అంశాన్ని జగన్ తెలుసుకోవాలని... ఈ ప్రభుత్వం నుంచి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే తెలుగుదేశం ధ్యేయమన్నారు.

 పక్కరాష్ట్రానికి తరలిపోతూ పట్టుబడిన సొమ్ము మంత్రి బాలిదేనని స్పష్టంగా ఆధారాలున్నాయని... ఆరంబాక్కమ్ సీఐ విచారణలో మంత్రి అనుచరులు ఆ సొమ్ము మంత్రిదేనని ఒప్పుకోవడం జరిగిందన్నారు. భారీ నోట్లకట్టలతో ఉన్న వ్యాన్ ని మంత్రి కొడుకు ముందు తీసుకెళ్లాడని కూడా వారు చెప్పడం జరిగిందన్నారు. దీనిపై జగన్ ప్రభుత్వం ఎవరెవరి ప్రమేయముందో తేల్చాలని... మంత్రి బాలినేనిని తక్షణమే మంత్రిమండలి నుండి బర్తరఫ్ చేసి న్యాయవిచారణ జరిపించాలని బొండా  డిమాండ్ చేశారు. 

ఆ సొమ్ము ఎక్కడిది.. ఎక్కడికి వెళుతోంది.. ఇదివరకు ఎంత సొమ్ముని అలా తరలించారు.. వంటి పూర్తి వివరాలను ప్రభుత్వం బయటపెట్టాలన్నారు. చీమచిటుక్కుమంటే టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టే జగన్ ప్రభుత్వం దీనికేం సమాధానం చెబుతుందన్నారు. రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఈ వ్యవహారాన్ని సుమోటోగా తీసుకొని విచారణ జరిపి వాస్తవాలు వెల్లడించాలని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. 

పట్టుబడిన మంత్రి సొమ్ముపై జాతీయ, తమిళ మీడియాలో కథనాలువస్తుంటే ఇక్కడివారు మాత్రం తేలుకుట్టినదొంగల్లా మిన్నకుండిపోయారన్నారు. రాష్ట్ర ప్రజల సొమ్ముని ఈవిధంగా తప్పుడు మార్గాల్లో తరలిస్తున్న వారి లోగుట్టుని బయటపెట్టాల్సిన బాధ్యత జగన్ ప్రభుత్వంపైనే ఉందన్నారు. రాష్ట్రంలో పేదలకు పని దొరక్క, తిండిలేక, కరోనాకారణంతో అల్లాడిపోతుంటే, ప్రభుత్వ పెద్దలు ఇలా కోట్లరూపాయలను దొడ్డిదారిన తరలించడం సిగ్గుచేటని ఉమ మండిపడ్డారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios