మూడు రాజధానులకే తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే రోజా స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆమె  రాజధాని విషయంలో తమ ప్రభుత్వ విజన్ తెలియజేయడంతోపాటు.. ప్రతిపక్ష పార్టీ నేతలపై విమర్శల వర్షం కురిపించారు.

జనసేన అధినేత పవన్ కి అసలు జీవోల గురించి అవగాహన లేదని చెప్పారు. ఒక చంద్రబాబు చీకటి జీవోలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అనంతరం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై కూడా సెటైర్లు వేశారు.

ఇటీవల బాలకృష్ణ .. సీఎం  జగన్ ని ఉద్దేశిస్తూ సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. రాయలసీమ పర్యటనలో ఆయన కాన్వాయిని కొందరు వైసీపీ నేతలు అడ్డుకోవడంపై మండిపడ్డారు. తన మౌనాన్ని చేతగాని తనం అనుకోవద్దని.. తాను ఒక్క కనుసైగ చేసి ఉంటే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయంటూ బాలకృష్ణ వైసీపీ నేతలను ఉద్దేశించి కౌంటర్లు వేశారు.

Also Read మండలి గ్యాలరీలో బాలకృష్ణతో రోజా సెల్ఫీ: ఫ్రేమ్ లో చంద్రబాబు సైతం..

ఆ  కామెంట్స్ కి తాజాగా రోజా కౌంటర్ ఇచ్చారు. బాలకృష్ణ కనుసైగ చేసి... ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకి బుద్ధి చెప్పి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. రాయలసీమ నుంచి చంద్రబాబు, బాలకృష్ణను తరిమికొట్టే రోజు వస్తుందంటూ జోస్యం చెప్పారు.

పెద్దల సభకు పెద్దలను తీసుకురాకుండా దద్దమ్మను తీసుకువచ్చారని ఆమె ఎగతాళి చేశారు. మండలిలో అందరూ చంద్రబాబు భజనపరులే ఉన్నారని.. వారు ఉన్నా లేకున్నా ఒకటేనని చెప్పారు. లోకేష్ ఎమ్మెల్యేగా గెలవలేడని ఆమె అభిప్రాయపడ్డారు. లోకేష్ రాజకీయ భవిష్యత్తు సమాధి అయిపోతుందన్నారు.అందుకే చంద్రబాబు మండలి రద్దును అడ్డుకోవాలని చూస్తున్నారని రోజా మండిపడ్డారు.