అమరావతి: మంత్రులు, వైసిపి ఎమ్మెల్సీలు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లు ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన విషయం తెలిసిందే. దీంతో వారిద్దరు తమ ఎమ్మెల్సీ పదవులను వదులుకోవాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వారిద్దరు రేపు(బుధవారం) తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయనున్నట్లు సమాచారం.

ఈ నెల 19వ తేదీన జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో వైసిపి నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. వ్యాపారవేత్తలు పరిమళ్ నత్వాని, అయోద్య రామిరెడ్డిలతో పాటు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎన్నికయ్యారు. అయితే మోపిదేవి, చంద్రబోస్ లు ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. 

అయితే ఒక చట్ట సభ నుంచి మరో చట్ట  సభకు ఎన్నికైతే 14 రోజుల్లోగా రాజీనామా చెయ్యాల్సి వుంటుంది. కాబట్టి వారిద్దరు రేపు తమ ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. 

read more   వారిద్దరి ఖాళీల భర్తీపై జగన్ ఆలోచన: విడదల రజని, రోజాలకు వరం?

రాజ్యసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున పోటీకిదిగిన వర్ల రామయ్య 17 ఓట్లతో ఓటమి పాలయ్యారు. నలుగురు అభ్యర్థుల గెలుపుతో రాజ్యసభలో వైసీపీ బలం ఆరుకు పెరిగింది. సంఖ్యాబలం లేకున్నప్పటికీ చంద్రబాబు నాయుడు తమ పార్టీ అభ్యర్థిగా రామయ్యను బరిలోకి దింపారు. ఈ సందర్భంగా టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలకు కూడా పార్టీ విప్ ను జారీ చేసింది. 

అయితే పార్టీ విప్ ను ధిక్కరించకుండా  కరణం బలరాం, మద్దాలి గిరి, వల్లభనేని వంశీ ఓటింగ్ కి కూడా హాజరయ్యారు. వారు రాజ్యసభ ఎన్నికల్లో లెక్కింపు లో చెల్లకుండా ఓటు హక్కు వినియోగించుకుని టిడిపి షాకిచ్చారు.