ముఖ్యమంత్రి జగన్ సభలో మోకాళ్లపై కూర్చున్న వ్యవహారంపై దళిత మంత్రి విశ్వరూప్ స్పందించారు. ఆత్మగౌరవాన్ని వదులుకుని తాను ఏనాడూ రాజకీయాలు చేయలేదని... అలాగయితే రాజకీయాలనే వదిలేస్తా తప్ప గౌరవాన్ని కాదన్నారు. 

అమలాపురం : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర దళిత మంత్రి పినిపె విశ్వరూప్ మోకాళ్లపై కూర్చున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సీఎం జగన్ తో పాటు సామాన్య మహిళలు సైతం కుర్చీలపై కూర్చునివుండగా మంత్రి మాత్రం వారిమధ్య మోకాళ్లపై కూర్చునివున్న ఆ ఫోటో రాజకీయ దుమారం రేపుతోంది. విశ్వరూప్ రాష్ట్ర మంత్రి అయినప్పటికి దళితుడు కావడంవల్లే సీఎం జగన్ కావాలనే అలా కూర్చోబెట్టి అవమానించాడని ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై స్పందిచిన విశ్వరూప్.. తన గౌరవానికి భంగం కలిగితే రాజకీయాల నుండి తప్పుకుంటానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 

తాను సంతోషంగా వుండేవరకే రాజకీయాల్లో కొనసాగుతానని... అదే లేకుంటే వెంటనే తప్పుకుంటానని విశ్వరూప్ అన్నారు. ఇన్నేళ్ళ తన రాజకీయ జీవితంలో ఏనాడూ ఆత్మగౌరవాన్ని వదులుకోలేదని అన్నారు. తాను ఎవరివద్ద కింద కూర్చోలేదని, ఏ సభలోనూ వెనకాల కూర్చుని అవమాన పడలేదని అన్నారు. అమలాపురం సభలో కూడా సీఎం జగన్ తో మహిళలు ఫోటో దిగుతుండగా అడ్డుగా వున్నానని తనంతట తానే కింద కూర్చున్నానని... అలా కూర్చోమని తననెవరూ చెప్పలేదని అన్నారు. తన గౌరవానికి భంగం కలిగితే రాజకీయాలనే వదులుకుంటా... అంతేగాని ఆత్మగౌరవాన్ని వదులుకోనని మంత్రి విశ్వరూప్ అన్నారు. 

Read More చంద్రబాబుది నారీ వ్యతిరేక చరిత్ర:వైఎస్ఆర్ సున్నా వడ్డీ నిధులు విడుదల చేసిన జగన్

అసలేం జరిగిందంటే : 

గత శుక్రవారం స్వయం సహాయక సంఘాలకు జీరో వడ్డీ రుణాలు విడుదల చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం కోనసీమ జిల్లా అమలాపురంలో ఏర్పాటుచేసింది. సీఎం జగన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రుణాల మంజూరు అనంతరం మహిళలు ముఖ్యమంత్రితో ఫోటో దిగే క్రమంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపె విశ్వరూప్ వేదికపైనే వున్నారు. అయితే సీఎం జగన్ తో పాటు డ్వాక్రా సంఘాల మహిళలు సైతం కుర్చీలపై కూర్చుని వుండగా వారి పక్కన మంత్రి మోకాళ్లపై కూర్చోవడం వివాదాస్పదంగా మారింది. 

విశ్వరూప్ దళితుడు కాబట్టే మంత్రి అయినప్పటికి సీఎం జగన్ తన పక్కన కూర్చోనివ్వలేదని ప్రతిపక్షాలు అంటున్నాయి. నిండుసభలో అందరూ చూస్తుండగానే దళిత మంత్రిని జగన్ మోకాళ్లపై కూర్చోబెట్టి అవమానించాడని ఆరోపిస్తున్నారు. విశ్వరూప్ మోకాళ్లపై కూర్చున్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. దీంతో వివాదం మరింత ముదరకుండా తాను అలా ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది విశ్వరూప్ క్లారిటీ ఇచ్చారు. 

ఇక తన కుటుంబంలో విబేధాలున్నాయంటూ జరిగిన ప్రచారంపైనా విశ్వరూప్ స్పందించారు. సీఎం జగన్ పర్యటన సందర్భంగా తన కొడుకుల పేరిట వెలిసిన ప్లెక్సీలే ఈ ప్రచారానికి కారణమని అన్నారు. అయితే ఇలా తన పేరుతో కొన్ని, కొడుకుల పేర్లతో మరికొన్ని ప్లెక్సీలు ఏర్పాటుచేయించింది తానేనని మంత్రి తెలిపారు. తమ కుటుంబంలో ఎలాంటి విబేధాలు లేవని... అందరం కలిసిమెలిసి హాయిగా వున్నామని విశ్వరూప్ తెలిపారు.