చంద్రబాబు నిర్ణయాన్నే తప్పు పట్టిన పితాని

చంద్రబాబు నిర్ణయాన్నే తప్పు పట్టిన పితాని

కాపు రిజర్వేషన్లకు సంబంధించి మంత్రి పితాని సత్యనారాయణ ముఖ్యమంత్రి నిర్ణయాన్నే తప్పుపడుతున్నారు. కాపులకు బిసి రిజర్వేషన్ వర్తింవ చేసే విషయంలో తమతో మాట్లాడితే బాగుండేదని పితాని తీరిగ్గా ఇపుడు వాపోతున్నారు. కాపులను బిసిల్లోకి చేరుస్తూ నిర్ణయం తీసుకునే ముందే బిసి మంత్రులు, ఎంఎల్ఏలతో చంద్రబాబు మాట్లాడివుంటే బాగుండేదని మంత్రి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. బిసి సంక్షేమ సంఘం నేతలతో కూడా ప్రభుత్వం ఏ స్ధాయిలోనూ మాట్లాడలేదు. అదే విషయాన్ని పితాని ప్రస్తావించారు. ఇదే విషయంపై శ్రీకాకుళం జిల్లాలోని పలాస టిడిపి ఎంఎల్ఏ గౌతు శ్యామ్ సుందర్ శివాజీ మాట్లాడుతూ, తమలో ఎవ్వరితోనూ సిఎం ఈ విషయం ప్రస్తావించలేదని కుండబద్దలు కొట్టారు.

కాపులకు రిజర్వేషన్ కల్పించే విషయంలో మెల్లిగా బిసి మంత్రులు, ఎంఎల్ఏలు బయటకు వస్తున్నారు. ఒకవైపు కాపులు చంద్రబాబు కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తుంటే వీళ్ళలో ఇంకా మంట పెరిగిపోతోంది. ఒకవిధంగా బిసి మంత్రులు రెండు విధాలుగా ఇరుక్కుపోయారు. ఇటు సామాజికవర్గంలోని నేతల ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోలేక, అటు సిఎం నిర్ణయాన్ని తప్పు పట్టలేకపోతున్నారు. బిసి సామిజికవర్గంలోని నేతలు మంత్రులు, కెఇ కృష్ణమూర్తి, అచ్చెన్నాయడు, పితాని సత్యానారాయణ, కొల్లు రవీంద్ర తదితరులతో మాట్లాడుతున్నారు.

కాపులను బిసిల్లోకి చేర్చటం వల్ల సామాజికవర్గానికి జరగబోయే నష్టాన్ని ఉదాహరణలతో సహా వివరిస్తున్నారు. గతంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించినపుడు బిసి కోటాలో ఉండే స్ధానిక సంస్ధల్లోని పదవుల్లో అధికశాతం  ముస్లింలే తీసేసుకున్నారన్న విషయాన్ని బిసి సామాజికవర్గ నేతలు మంత్రులకు గుర్తుచేస్తున్నారు. సరే, కాపులకు బిసి రిజర్వేషన్ సౌకర్యం కల్పించటాన్ని ప్రధాని తిరస్కరించిన సంగతి అందరికీ తెలిసిందే. దాంతో చంద్రబాబు నిర్ణయం అమలయ్యే అవకాశాలు లేవన్నది తేలిపోయింది.

అయితే, బిసిల విషయంలో చంద్రబాబు మనసులోని మాట బయటపడటంతో మంత్రులు, ఎంఎల్ఏలకు ఇబ్బందిగా మారింది. దాంతో మంత్రులు నేతలకు సర్దిచెప్పలేక సిఎంతో ప్రస్తావించలేక అవస్ధలు పడుతున్నారు. మొత్తం మీద బిసి సామాజికవర్గం నేతలు మంత్రులు, టిడిపి ఎంఎల్ఏలపై బాగా ఒత్తిడి పెడుతున్నట్లే కనబడుతోంది. విదేశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత ఈ విషయమై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page