రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితులను  దృష్టిలో పెట్టుకోకుండా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అదనపు నిధులు కేటాయించకపోవటం  బాధాకరమని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కె.ఎస్. జవహర్ పేర్కొన్నారు. పార్లమెంట్లో ఆంధ్ర ఎంపీలు చేస్తున్న నిరసనకు మంత్రి జవహర్ సంఘీభావం ప్రకటించారు. రాష్ట్రం ఇచ్చిన నివేదికలకు కేంద్రం ప్రకటించిన నిధులకు ఏమాత్రం పొంతన లేదని మండిపడ్డారు.  ముఖ్యమంత్రి 29 సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధానితో పాటు పలువురు మంత్రులను కలిసి నివేదికలు ఇచ్చినా ఉపయోగం కనబడలేదన్నారు.

అదే సమయంలో కేంద్రం ఐదుసార్లు బడ్జెట్ ప్రకటించినా మిత్రధర్మం కారణంగా ఓపిక పట్టినట్లు వివరించారు. మెట్రోరైలు, రైల్వే జోన్, పెట్రో కారిడార్, అమరావతి నుంచి రాష్ట్ర రహదారులకు కనెక్టివిటీ రోడ్డులు లేకపోవటం బాధాకరమని అన్నారు. ప్రధానంగా 2017-18లో ఎస్సి లకు 52,393 కోట్లు కేటాయిస్తే ఈ ఏడాది రూ. 56 కోట్లతో సరిపెట్టేశారని ఆరోపించారు. ఇప్పటి వరకు మిత్రధర్మం కారణంగా ఓపిక పట్టిన 5 కోట్ల ఆంధ్రులు ఇపుడు రగిలిపోతున్నారని జవహర్ హెచ్చరించారు. ఆంధ్ర ఎంపీలకు రాష్ట్ర వ్యాప్తంగా సంఘీభావం ప్రకటించటం పట్ల ప్రతీ ఒక్కరికి కృతజ్ఞత తెలిపారు. ఆంధ్రుల మనోభావాలను దెబ్బ తీస్తే ఎంతటి త్యాగానికైనా సిద్ధమన్నారు.