ఇండియా పేరును భారత్ గా మార్చాలని కేంద్ర ప్రయత్నిస్తోందన్న ప్రచారంపై ఏపీ దేవాదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
అమరావతి : ప్రతిపక్ష పార్టీలన్నీ కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా (Indian National Developmental Inclusive Alliance) పేరుతో కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇకపై దేశాన్ని ఇండియా గా కాకుండా భారత్ గా సంభోదించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నెల (సెప్టెంబర్) 9, 10 తేదీల్లో దేశ రాజధాని డిల్లీలో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు వచ్చే వివిధ దేశాల అధినేతలు, ప్రతినిధులకు రాష్ట్రపతి విందు ఇవ్వనున్నారు. ఈ విందు ఆహ్వాన పత్రికలో ''ప్రెసిడెంట్ ఆఫ్ భారత్'' అని రాసివుండటం వివాదానికి దారితీసింది.
ఇండియా పేరును భారత్ గా మార్చడానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న ఊహాగానాలపై ఏపీ మంత్రి కొట్టుసత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. దేశానికి భారత్ అని పేరు మార్చినంత మాత్రాన విదేశాల వాళ్లు ఇండియా అని పిలకుండా ఉంటారా..? అని అన్నారు. అయితే వైసిపి అటు ఇండియా కూటమిలో గానీ, ఇటు ఎన్డీఏ కూటమిలో గానీ లేదని మంత్రి సత్యనారాయణ స్పష్టం చేసారు.
Read More సనాతన ధర్మానికి కులాలను ఆపాదించొద్దు: ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై టీటీడీ చైర్మెన్ భూమన
ఇక ఏపీలోని ప్రముఖ దేవాలయాల అభివృద్దికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని మంత్రి సత్యనారాయణ వెల్లడించారు. విజయవాడ కనకదుర్గమ్మ, శ్రీశైలం మల్లిఖార్జున స్వామి ఆలయాలను రూ.400 కోట్ల అంచనాల వ్యయంతో అభివృద్ధి చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే విజయవాడ దుర్గగుడి ఆలయ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని... రూపొందించిన ప్లాన్ ప్రకారం టెండర్ల ప్రక్రియను ప్రారంభించామన్నారు. ప్రసాదం పోటు, అన్నదాన బిల్డింగ్, శివాలయం, రాక్ మిటిగేషన్, స్కాడా వంటి పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు.
ప్రస్తుతంఇంద్రకీలాద్రిపైకి వెళ్లే ఘాట్ రోడ్డు వాస్తు ప్రకారం లేదని... నైరుతి వైపు నుంచి రాకపోకలు సరికాదని వాస్తు నిపుణులు అభిప్రాయపడుతున్నారని అన్నారు. అందువల్లే రాజగోపురం వైపు నుంచే భక్తుల రాకపోకలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ప్రస్తుతమున్న క్యూ కాంప్లెక్సుకు అదనంగా మరో క్యూ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు.
క్యూ లైన్ల కోసం ర్యాంప్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సత్యనారాయణ తెలిపారు. కొత్త క్యూ కాంప్లెక్సులో కూడా ఉచితంగా, రూ. 100, 300, 500 దర్శనాలకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. రెండు అంతస్తుల్లో అన్నదాన భవనం, దీని పైనుంచి దర్శనం కోసం ఫ్లైఓవర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ నెలలోనే ఈ పనులకు శ్రీకారం చుడతామని.. సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేస్తారని కొట్టు సత్యనారాయణ తెలిపారు.
