సనాతన ధర్మానికి కులాలను ఆపాదించొద్దు: ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై టీటీడీ చైర్మెన్ భూమన
తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు.
తిరుపతి: సనాతన ధర్మానికి కులాలను ఆపాదించవద్దని టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి కోరారు.మంగళవారంనాడు టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ఇలాంటి వ్యాఖ్యలతో సమాజంలో అలజడులు చెలరేగుతాయన్నారు. సనాతన ధర్మం కాదు... అదొక జీవన యానంగా టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
ఈ నెల 2న చెన్నైలో జరిగిన కార్యక్రమంలో సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని ఆయన వ్యాఖ్యానించారు. సనాతన ధర్మం సామాజిక న్యాయానికి వ్యతిరేకమని దానిని వ్యతిరేకించడం కాదు.. పూర్తిగా తొలగించాలన్నారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చారు. ఆ వ్యాధులను ఎలా నిర్మూలిస్తామో సనాతన ధర్మాన్ని కూడ అలానే నిర్మూలించాలని ఆయన కోరారు.
ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడుతుంది. ఉదయనిధి స్టాలిన్ పై చర్యలు తీసుకోవాలని తమిళనాడు బీజేపీ నేతలు గవర్నర్ ను కోరారు. మరో వైపు కొందరు ప్రముఖులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు కూడ లేఖ రాశారు. ఉదయనిధి వ్యాఖ్యల నేపథ్యంలో ఇండియా కూటమిపై బీజేపీ విమర్శలు ఎక్కు పెట్టింది.ఈ వ్యాఖ్యలను ఇండియా కూటమి సమర్ధించడంపై బీజేపీ మండిపడింది. నాడు యూదులపై హిట్లర్ ఎలా వ్యాఖ్యలు చేశారో.. సనాతన ధర్మంపై ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు అలా ఉన్నాయని ఆయన బీజేపీ విమర్శలు చేసింది.
also read:సనాతన ధర్మంపై వ్యాఖ్యలు: నాడు హిట్లర్.. నేడు ఉదయనిధి అంటూ బీజేపీ ఫైర్
సనాతన ధర్మంపై వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్ తల నరికి తెచ్చివ్వాలని కూడ కొందరు వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలకు కూడ ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. మరో వైపు ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై బెంగాల్ సీఎం మమత బెనర్జీ స్పందించారు. ఎవరిని కూడ కించపర్చవద్దని సూచించారు. ఇండియా కూటమిలోని పార్టీలు కూడ ఈ వ్యాఖ్యలపై కొంత భిన్న వైఖరితో ఉన్నట్టుగా ప్రచారం సాగుతుంది. ఈ వ్యాఖ్యలతో నష్టం కలగకుండా ఉండేందుకు ఇండియా కూటమి ప్రయత్నాలు ప్రారంభించింది.