రోడ్డు ప్రమాదంలో గాయపడి, రోడ్డుమీద గాయాలతో పడున్న వాళ్ళను రక్షించి మానవత్వాన్ని చాటుకున్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. 

విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మానవత్వం చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి - విశాఖపట్నం జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని గుడివాడ అమర్‌నాథ్ ఆదుకున్నారు. గాయపడిన వారిని తన వాహనంలో ఆస్పత్రికి తరలించారు.

ఆ సమయంలో మంత్రి తన నియోజకవర్గం అనకాపల్లి నుంచి విశాఖకు తిరిగి వస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మంత్రి కాన్వాయ్ వస్తున్న సమయంలో రోడ్డు పక్కన ఒక చిన్న పిల్లవాడు, మరొక వ్యక్తి గాయాలతో రక్తస్రావమై సహాయం కోసం ఎదురుచూస్తూ కనిపించారు. వారి మోటార్ బైక్ ప్రమాదానికి గురైంది. 

ఆదిత్య-ఎల్ 1 ప్రయోగం : ఏపీలోని చెంగాళమ్మ ఆలయంలో ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ ప్రత్యేక ప్రార్థనలు...

అది గమనించిన మంత్రి వెంటనే తన కాన్వాయ్‌ని ఆపి, తన భద్రతా సిబ్బందిని వారికి సహాయం చేయమని కోరారు. బుచ్చయ్యపేట మండలం రాజాం గ్రామానికి చెందిన పినపోలు నాగేశ్వరావు, అతని సోదరుడి కుమారుడు సంజయ్‌ శుక్రవారం బైక్ పై విశాఖపట్నం వెళ్తున్నారు. 

వారిద్దరూ బైక్‌పై వెడుతున్న సమయంలో నాగేశ్వరరావు అదుపు తప్పి రోడ్డుపక్కన ఉన్న రెయిలింగ్‌ను ఢీకొట్టాడు. దీంతో నాగేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. 10 ఏళ్ల బాలుడు సంజయ్‌కు కూడా గాయాలై, రక్తం కారుతోంది.

రోడ్డుపక్కన వారిని చూసిన మంత్రి తన కాన్వాయ్‌ని ఆపి గాయపడిన వారిని పోర్టు సిటీ శివార్లలోని లంకెలపాలెంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సిహెచ్‌సి)కి పంపించారు. రెండు అంబులెన్సులను రప్పించి మెరుగైన వైద్య సౌకర్యం కోసం వైజాగ్‌కు తరలించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు.