సూర్యుడి మీదికి ఆదిత్య-ఎల్ 1 ప్రయోగించనున్న నేపథ్యంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్ తన సిబ్బందితో చెంగాళమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తిరుపతి : ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట పట్టణంలోని చెంగాళమ్మ అమ్మవారి ఆలయంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్ శుక్రవారం పూజలు చేశారు.

ఇస్రో చీఫ్ తన సహచరులతో కలిసి ఆలయాన్ని సందర్శించారు. శనివారంనాడు ప్రయోగించడానికి కౌంట్ డౌన్ మొదలైన ఆదిత్య-ఎల్ 1 మిషన్ విజయవంతం కావాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. చంద్రయాన్-3 మిషన్ ప్రయోగానికి ముందు కూడా సోమనాథ్ ఇక్కడ ప్రార్థనలు చేశారు.

సూర్యుడిపై ప్రయోగానికి కౌంట్‌డౌన్ మొదలైంది.. రేపు 11.50 గంటలకు ఆదిత్య ఎల్-1 ప్రయోగం

కార్యనిర్వహణాధికారి ఎ శ్రీనివాసులు రెడ్డి నేతృత్వంలో ఆలయ అర్చకులు ఇస్రో శాస్త్రవేత్తలకు ఘనంగా స్వాగతం పలికారు. ఆ తరువాత వారికి ‘ప్రసాదాలు’ అందజేశారు.

ఆలయంలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఇస్రో చీఫ్ మీడియాతో మాట్లాడారు. ఆదిత్య-ఎల్1 మిషన్‌ను శనివారం ఉదయం 11.50 గంటలకు శ్రీహరికోట స్పేస్‌పోర్ట్ నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ57 ద్వారా ప్రయోగించనున్నట్లు ప్రకటించారు.

మిషన్ 125 రోజుల పాటు ప్రయాణం చేసిన తరువాత సూర్యుని మీదున్న వాతావరణాన్ని అధ్యయనం చేస్తుంది. ఇస్రో చీఫ్ వెంట ఎస్‌డిఎస్‌సి-షార్ డైరెక్టర్ ఎ రాజరాజన్, గ్రూప్ డైరెక్టర్ పి గోపీకృష్ణ కూడా ఉన్నారు.

కాగా, ఇస్రో ప్రతినిధుల బృందం శుక్రవారం ఉదయం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆదిత్య-ఎల్1 వ్యోమనౌక ప్రతిరూపాన్ని గుడిలోకి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు చేయించారు.

ISRO Aditya L1 Sun Mission Live : నింగిలోకి దూసుకుపోతున్న ఆదిత్య ఎల్-1