మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నోరు మూయించాలని విమర్శలు, ఆరోపణలు చేస్తుంటారని ఫైర్ అయ్యారు. ప్రజల కోసం వాస్తవాలు మాట్లాడుతూనే వుంటానని ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు.
మంత్రి ధర్మాన ప్రసాదరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తన నోరు మూయించాలని విమర్శలు, ఆరోపణలు చేస్తుంటారని ఫైర్ అయ్యారు. ఎవరో భయపెడితే, వణికిపోయి వెనుకడుగు వేసే రకాన్ని తాను కాదన్నారు. తాను భూములు దోచుకున్నానని కూడా ప్రచారం చేశారని ధర్మాన ప్రసాదరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయంగా పనిచేస్తుంటే తప్పు అంటున్నారని.. 40 ఏళ్లుగా తన వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. ప్రజల తరపున నిజాలను నిర్భయంగా మాట్లాడుతున్నానని మంత్రి స్పష్టం చేవారు. తానెంటో, తన క్యారెక్టర్ ఏంటో తన మిత్రులు, జనమే చెప్పాలన్నారు. ప్రజల కోసం వాస్తవాలు మాట్లాడుతూనే వుంటానని ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు.
కాగా.. మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇటీవల కాలంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ఆయన మరోసారి నోరుజారారు. కార్యకర్తలు ఆర్ధికంగా చితికిపోయారని.. నాలుగేళ్లుగా ఖర్చు మాత్రమే పెడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. కార్యకర్తలకు పైసా లబ్ధి లేదని, ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎన్నడి నుంచో డబ్బులు వచ్చి మీటింగ్‌లు పెట్టం లేదని.. చేతి చమురే వదులుతోందని ధర్మాన ప్రసాదరావు అన్నారు.
ఎక్కడా అవినీతి లేకుండా ప్రతీ ఒక్క లబ్ధిదారుని ఇంటికే పథకాలు అందుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. నిజాయితీగా పాలన అందిస్తున్నామని.. గతంలో ఎమ్మెల్యే, ఛైర్మన్, మున్సిపల్ కమీషనర్ పేర్లు వినిపించడం లేదని ప్రసాదరావు పేర్కొన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అన్ని హామీలు అమలు చేశామని.. ఇలా చేసిన పార్టీ దేశంలో మరొకటి లేదని ధర్మాన అన్నారు. జన్మభూమి కమిటీలు గతంలో ప్రజలను బెదిరించేవని ప్రసాదరావు ఆరోపించారు.
