నాలుగేళ్లుగా పైసా రావడం లేదని, కార్యకర్తలు ఆర్ధిక చితికిపోయారని వ్యాఖ్యానించారు మంత్రి ధర్మాన ప్రసాదరావు.  కార్యకర్తలకు పైసా లబ్ధి లేదని, ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. 

వైసీపీ సీనియర్ నేత, మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇటీవల కాలంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన మరోసారి నోరుజారారు. కార్యకర్తలు ఆర్ధికంగా చితికిపోయారని.. నాలుగేళ్లుగా ఖర్చు మాత్రమే పెడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. మంగళవారం శ్రీకాకుళంలో జరిగిన ఓ కార్యక్రమంలో ధర్మాన మాట్లాడుతూ.. కార్యకర్తలకు పైసా లబ్ధి లేదని, ప్రజలకు మంచి చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎన్నడి నుంచో డబ్బులు వచ్చి మీటింగ్‌లు పెట్టం లేదని.. చేతి చమురే వదులుతోందని ధర్మాన ప్రసాదరావు అన్నారు. 

ఎక్కడా అవినీతి లేకుండా ప్రతీ ఒక్క లబ్ధిదారుని ఇంటికే పథకాలు అందుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. నిజాయితీగా పాలన అందిస్తున్నామని.. గతంలో ఎమ్మెల్యే, ఛైర్మన్, మున్సిపల్ కమీషనర్ పేర్లు వినిపించడం లేదని ప్రసాదరావు పేర్కొన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అన్ని హామీలు అమలు చేశామని.. ఇలా చేసిన పార్టీ దేశంలో మరొకటి లేదని ధర్మాన అన్నారు. జన్మభూమి కమిటీలు గతంలో ప్రజలను బెదిరించేవని ప్రసాదరావు ఆరోపించారు. 

Also Read: ఆ మేనిఫెస్టోను జనం నమ్మరు.. అక్కడి హామీలను కాపీ చేసి పార్ట్-2 వదులుతారేమో : బాబుపై విజయసాయిరెడ్డి సెటైర్లు

అంతకుముందు వైసీపీ ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోదన్నారు ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. మంగళవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ అనుబంధ విభాగాల నేతలతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు ట్రాప్‌లో అమిత్ షా పడ్డారా అంటూ ఆయన సెటైర్లు వేశారు. విశాఖకు ఖచ్చితంగా పరిపాలనా రాజధానిని తరలిస్తామని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రాజధానికి కావాల్సిన భవనాలను రెండేళ్ల క్రితమే గుర్తించామని ఆయన తెలిపారు. కేంద్రం హామీలను నెరవేర్చడం లేదని సాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు మినీ ఫెస్టోను జనం నమ్మరని ఆయన స్పష్టం చేశారు. 

నవంబర్‌లో జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో వివిధ పార్టీలు ఇచ్చే హామీలను కాపీ కొట్టి చంద్రబాబు పార్ట్ 2 మేనిఫెస్టోను ప్రకటిస్తారేమోనంటూ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. పార్టీ విజయం కోసం పనిచేయాలంటూ ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, ఎమ్మెల్యే ఆదేశాలనే పాటించాలని .. రెండో గ్రూప్‌ను ప్రోత్సహించవద్దన్నారు. విపక్షంలో వుండగా జనగ్ వెంట నడిచిన వారికి వైసీపీ ప్రభుత్వం వచ్చాక తగిన గుర్తింపు లభించిందని విజయసాయిరెడ్డి వెల్లడించారు. అనుబంధ విభాగాల జిల్లా, మండల స్థాయి కమిటీలు పూర్తైన తర్వాత అనుబంధ విభాగాల అధ్యక్షులు, జోనల్ ఇన్‌ఛార్జీలతో, జిల్లా అధ్యక్షులతో సీఎం జగన్ సమావేశం అవుతారని ఆయన తెలిపారు.