మూడు రాజధానుల వ్యవహారం ఏపీలో మరోసారి ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖ నుంచి పాలన ప్రారంభిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల వ్యవహారంతో మరోసారి రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు, మంత్రులు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే విశాఖ నుంచి పాలన సాగిస్తామన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శివరామకృష్ణన్ కమీషన్, పార్లమెంట్‌లు సైతం వికేంద్రీకరణే మంచిదన్నాయని గుర్తుచేశారు. దేశంలో 8 రాష్ట్రాల్లో కూడా కోర్టు ఒక చోట, రాజధాని మరోచోట వున్నాయని బుగ్గన పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ది కోసమే మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే.. ఏపీ రాజధాని అంశంపై నిన్న బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. విశాఖపట్నం ఒక్కటే రాజధాని అని బుగ్గన స్పష్టం చేశారు. మూడు రాజధానులు అనేది మిస్ కమ్యూనికేషన్ అని.. పరిపాలన అంతా విశాఖ నుంచే జరుగుతుందని తెలిపారు. విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ 2023 నిర్వహించనున్న నేపథ్యంలో మంగళవారం రోజున బెంగళూరులో జరిగిన రోడ్ షోలో ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ‘‘ఆంధ్రప్రదేశ్ తదుపరి రాజధాని విశాఖపట్నం అని ప్రభుత్వం నిర్ణయించింది. అది బెస్ట్ ప్లేస్ అని భావిస్తున్నాం. మూడు రాజధానులు అనేది మిస్ కమ్యూనికేషన్. పరిపాలన అంతా విశాఖ నుంచే జరుగుతుంది. విశాఖలో ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాల కారణంగా దానిని ఎంచుకోవడం జరిగింది. విశాఖ భవిష్యత్తులో మరింతగా అభివృద్ది చెందే అవకాశం ఉంది. అక్కడ ఓడ రేవు ఉంది. కాస్మొపాలిటన్ కల్చర్.. వాతావరణం... అన్ని రకాలుగా విశాఖ అనుకూలం.
కర్నూలు మరో రాజధాని కాదు. అక్కడ హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ ఉంటుంది. కర్ణాటకలోని ధార్వాడ్‌లో హైకోర్టు బెంచి, గుల్బర్గాలో మరో బెంచి ఉన్నాయి. ఈ మాదిరిగా కర్నూలులో కూడా హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ ఉండనుంది. 1937 శ్రీబాగ్ ఒప్పందంలో... రాజధాని ఒక చోట, హైకోర్టు మరొక చోట ఉండాలని పేర్కొన్నారు. కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు బెళగాంలో ఒక సెషన్ నిర్వహిస్తారు. ఇందుకు కారణమేమిటో అందరికి తెలుసు. అదే విధంగా ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఒక సెషన్ గుంటూరులో జరుగుతాయి. భవిష్యత్తులో ప్రాంతాల మధ్య విభేదాలు రాకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తిరుపతి వెంకటేశ్వర స్వామి కొలువైన ప్రాంతం.. తిరుపతి ఏపీకే కాదు.. ఆధ్యాత్మికంగా ప్రపంచానికే రాజధాని’’ అని బుగ్గన పేర్కొన్నారు.
