ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశం చాలా కాలంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. మూడు రాజధానులను ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రకటించింది. అప్పటినుంచి రాజధాని అంశంలో రచ్చ కొనసాగుతుంది. 

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అంశం చాలా కాలంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఏపీ పునర్విభజన తర్వాత ఇక్కడ అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం.. అమరావతిని రాజధానిగా నిర్ణయించింది. రాజధాని ప్రాంత అభివృద్ది కోసం రైతుల నుంచి భూసేకరణ చేపట్టింది. అయితే 2019 ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం.. మూడు రాజధానులను ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రకటించింది. పరిపాలన రాజధానిగా విశాఖ, న్యాయ రాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి ఉండనున్నాయని తెలిపింది. అయితే ఇందుకు సంబంధించి అమరావతి రైతులతో పాటు, విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత చోటుచేసుకుంది. పలు నాటకీయ పరిణామాల అనంతరం ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి సుప్రీం కోర్టు పరిధిలో ఉంది. 

ఇదిలా ఉంటే.. ఏపీ రాజధాని అంశంపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. విశాఖపట్నం ఒక్కటే రాజధాని అని బుగ్గన స్పష్టం చేశారు. మూడు రాజధానులు అనేది మిస్ కమ్యూనికేషన్ అని.. పరిపాలన అంతా విశాఖ నుంచే జరుగుతుందని తెలిపారు. విశాఖపట్నంలో మార్చి 3, 4 తేదీల్లో ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ 2023 నిర్వహించనున్న నేపథ్యంలో మంగళవారం రోజున బెంగళూరులో జరిగిన రోడ్ షోలో ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ‘‘ఆంధ్రప్రదేశ్ తదుపరి రాజధాని విశాఖపట్నం అని ప్రభుత్వం నిర్ణయించింది. అది బెస్ట్ ప్లేస్ అని భావిస్తున్నాం. మూడు రాజధానులు అనేది మిస్ కమ్యూనికేషన్. పరిపాలన అంతా విశాఖ నుంచే జరుగుతుంది. విశాఖలో ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాల కారణంగా దానిని ఎంచుకోవడం జరిగింది. విశాఖ భవిష్యత్తులో మరింతగా అభివృద్ది చెందే అవకాశం ఉంది. అక్కడ ఓడ రేవు ఉంది. కాస్మొపాలిటన్‌ కల్చర్‌.. వాతావరణం... అన్ని రకాలుగా విశాఖ అనుకూలం. 

కర్నూలు మరో రాజధాని కాదు. అక్కడ హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ ఉంటుంది. కర్ణాటకలోని ధార్వాడ్‌లో హైకోర్టు బెంచి, గుల్బర్గాలో మరో బెంచి ఉన్నాయి. ఈ మాదిరిగా కర్నూలులో కూడా హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ ఉండనుంది. 1937 శ్రీబాగ్ ఒప్పందంలో... రాజధాని ఒక చోట, హైకోర్టు మరొక చోట ఉండాలని పేర్కొన్నారు. కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు బెళగాంలో ఒక సెషన్ నిర్వహిస్తారు. ఇందుకు కారణమేమిటో అందరికి తెలుసు. అదే విధంగా ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ఒక సెషన్ గుంటూరులో జరుగుతాయి. భవిష్యత్తులో ప్రాంతాల మధ్య విభేదాలు రాకుండా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తిరుపతి వెంకటేశ్వర స్వామి కొలువైన ప్రాంతం.. తిరుపతి ఏపీకే కాదు.. ఆధ్యాత్మికంగా ప్రపంచానికే రాజధాని’’ అని బుగ్గన పేర్కొన్నారు. 

అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి మూడు రాజధానుల పేరును ప్రధానంగా ప్రస్తావిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ విధమైన కామెంట్స్ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బుగ్గన వ్యుహాత్మకంగానే ఈ కామెంట్స్ చేశారా? అనే చర్చ కూడా సాగుతుంది. మూడు రాజధానుల అంశంలో వైసీపీ వైఖరిలో మార్పు వచ్చిందా? అనే చర్చ కూడా మొదలైంది. మరోవైపు విశాఖ ఏకైక రాజధాని అంటూ బుగ్గన చేసిన కామెంట్స్‌పై ప్రతిపక్ష టీడీపీ స్పందించింది. మూడు రాజధానులు తప్పుగా కమ్యూనికేట్ అయిందని.. 4 ఏళ్ళ తరువాత చెప్తారా అని ప్రశ్నించింది. ‘‘ఎవరు తప్పుగా చెప్పింది? అసెంబ్లీలో సౌత్ ఆఫ్రికా మోడల్ అని చెప్పింది మీ ముఖ్యమంత్రి కాదా ? పిచ్చోడి చేతిలో రాయిలాగా, పరిపాలన అయిపోయింది. ఎన్ని సార్లు మడమ తిప్పుతారు ? ఎన్ని సార్లు మాట మార్చుతారు ?’’ అని టీడీపీ ప్రశ్నల వర్షం కురిపించింది.