ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగకుండా చేస్తామన్నారు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. గురువారం కేబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక్క రైతుకు కూడా నష్టం జరగకుండా చేస్తామన్నారు.

ఒకవేళ ఏ ఒక్కరికైనా నష్టం జరిగినా మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ఆయన సవాల్ విసిరారు. పథకం సజావుగా అమలైతే చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని బాలినేని ప్రశ్నించారు.

వ్యవసాయ మోటార్లకు మీటర్లు వద్దని వైఎస్ ఎప్పుడూ చెప్పలేదని ఆయన గుర్తుచేశారు. కేంద్రం ఆదేశాలకు అనుగుణంగానే తాజా నిర్ణయం తీసుకున్నామని.. దీని వల్ల అనధికార కనెక్షన్లు క్రమబద్ధీకరణ అవుతాయని బాలినేని అన్నారు. దీనితో పాటు నాణ్యమైన విద్యుత్ ఇవ్వకపోతే రైతులునిలదీసే అవకాశముందని మంత్రి అభిప్రాయపడ్డారు.

Also Read:ఉచిత విద్యుత్ పథకానికి నగదు బదిలీ: ఏపీ కేబినెట్ ఆమోదం

కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశం గురువారం నాడు సీఎం జగన్ అధ్యక్షతన ఇవాళ జరిగింది.ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేబినెట్ లో చర్చించారు. వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్  మీటర్లు  బిగించడం వల్ల ఇబ్బంది లేదని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు.

ఒక్క కనెక్షన్ కూడ తొలగించబోమని ఈ సందర్భంగా సీఎం జగన్ వ్యాఖ్యానించారు. రైతుపై ఒక్క పైసా అదనంగా భారం పడదని ఆయన స్పష్టం చేశారు. 30 నుండి 35 ఏళ్ల వరకు ఉచిత విద్యుత్ కు ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు.

వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, జగనన్న విద్యాకానుక పథకాలు, గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లిఫ్ట్, గాలేరు, నగరి నుండి హంద్రీనీవా ఎత్తిపోతల పథకం యురేనియం ప్రభావిత గ్రామాల్లో ఆయకట్టుకు నీరందించే ప్రాజెక్టులపై చర్చించారు.