విజయవాడ: రాష్ట్ర విద్యుత్, అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై టీడీపీ నాయకులు అర్ధం లేని ఆరోపణలు చేస్తూ చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. చెన్నై చెక్ పోస్ట్ వద్ద పట్టుబడిన నగదు మంత్రి బాలినేనిదే అంటూ ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 

కారు పై ఉన్న స్టిక్కర్ బాలినేనిది కాదని...పట్టుబడిన నగదు బంగారం వ్యాపారం చేసే వ్యక్తిదని ప్రకటించినప్పటికీ టీడీపీ దీనిపై నానా యాగీ చేయడమేంటని అన్నారు. దీని వెనుక బాలినేనిని అభాసుపాలు చేయాలనే దురుద్దేశం ఉందని ప్రజలందరికీ అర్థమవుతుందన్నారు. బాలినేని ప్రజల మనిషన్న సంగతి అందరికీ తెలుసన్నారు. 

read more  ఆ డబ్బు చెన్నై నుండి మారిషస్ కు..జగన్ కుటుంబసభ్యుల హస్తం: మాజీ మంత్రి సంచలనం

ఆరోపణలు చేస్తున్న టీడీపీ నాయకులు మరి బాలినేని చేస్తున్న సవాల్ ను స్వీకరిస్తామని చెప్పటం లేదెందుకని ప్రశ్నించారు. నిరూపించలేని ఆరోపణలు చేస్తున్న టీడీపీ నాయకులు బాలినేనికి క్షమాపణలు చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. 

ప్రజలు గత ఎన్నికల్లో బుద్ధిచెప్పిన విధానంతో ఏమి చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న టీడీపీ ఇటువంటి చౌకబారు రాజకీయాలు చేస్తుందన్నారు. ఇలాంటి రాజకీయాలు చేయటం టీడీపీకి కొత్తేమి కాదు, అదొక లిటిగేషన్ పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా టీడీపీ పద్దతి మార్చుకోవాలని మంత్రి సురేష్ హితవు పలికారు.