Mayor Candidates Assets: ఆంధ్రప్రదేశ్‌లో మేయర్ పదవుల బరిలో ఉన్న అభ్యర్థుల ఆస్తులు, అప్పులు, ఆదాయం, కేసుల వివరాలు ఆసక్తికరంగా మారాయి. కర్నూలు, విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, నెల్లూరు అభ్యర్థుల ఎన్నికల అఫిడవిట్లలో వెల్లడైన వివరాలు ఇవే.
కర్నూలు మేయర్ బరిలో అత్తాకోడళ్లు.. సుశీల కుటుంబానికే అధిక ఆస్తులు
కర్నూలు మేయర్ పదవి కోసం వైకాపా తరఫున సుశీల, తెదేపా తరఫున విజయ ప్రత్యూష పోటీ చేస్తున్నారు. వీరిద్దరూ అత్తాకోడళ్లు కావడం గమనార్హం. ఎన్నికల అఫిడవిట్లలో వెల్లడించిన వివరాల ప్రకారం.. సుశీల, ఆమె భర్త మణిగాంధీకి కలిపి విజయ ప్రత్యూష కుటుంబంతో పోలిస్తే ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. మణిగాంధీ గతంలో కోడుమూరు ఎమ్మెల్యేగా పనిచేయగా, సుశీల మామ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
తెదేపా అభ్యర్థి విజయ ప్రత్యూష ఆస్తులు
విజయ ప్రత్యూషకు కర్నూలు శివారులోని తాండ్రపాడులో 2,200 చదరపు అడుగుల స్థలం ఉంది. 2016 డిసెంబరులో రూ.2 లక్షలకు కొనుగోలు చేసిన ఈ స్థలం ప్రస్తుత మార్కెట్ విలువను రూ.9.77 లక్షలుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆమె వద్ద రూ.లక్ష నగదు, బ్యాంకు ఖాతాలో రూ.15,247తో పాటు సుమారు రూ.20 లక్షల విలువైన 150 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయి. మొత్తం చరాస్తుల విలువ రూ.21.15 లక్షలుగా వెల్లడించారు. ఆమె భర్త విజయరాజు పేరుపై మారుతి బాలెనో కారు, యాక్టివా ద్విచక్ర వాహనం, మ్యూచువల్ ఫండ్స్, నగదు, ఆరోగ్య బీమా ఉన్నాయి. వీటి విలువను కలిపి రూ.8.08 లక్షల చరాస్తులుగా పేర్కొన్నారు.
వైకాపా అభ్యర్థి సుశీల ఆస్తుల వివరాలు
సుశీలకు నిడ్జూరు, మునగాలపాడు ప్రాంతాల్లో కలిపి 10.4 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. దీని ప్రస్తుత మార్కెట్ విలువ రూ.3.83 కోట్లుగా చూపించారు. కర్నూలులో 288.88 చదరపు గజాల భూమి ఉండగా, దాని మార్కెట్ విలువ రూ.49.83 లక్షలుగా పేర్కొన్నారు. ఆమె వద్ద రూ.8 లక్షల నగదు, బ్యాంకు ఖాతాలో రూ.2,324, రూ.30 లక్షల విలువైన 300 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నాయి. మొత్తం చరాస్తుల విలువ రూ.38.02 లక్షలుగా వెల్లడించారు.
సుశీల భర్త మణిగాంధీ పేరుపై రూ.5 లక్షల నగదు, రూ.15 లక్షల విలువైన ఇన్నోవా కారు, రూ.50 వేల విలువైన యాక్టివా, రూ.10 లక్షల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఆయన చరాస్తుల మొత్తం విలువ రూ.47.30 లక్షలు. మునగాలపాడులో ఆయన పేరుపై ఉన్న 2.82 ఎకరాల భూమి విలువ రూ.4.50 కోట్లుగా అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
విశాఖపట్నం: ముక్కా శ్రావణి, వరుదు కల్యాణి ఆస్తులెంత?
మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) మేయర్ పదవికి 15 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వీరిలో కూటమి అభ్యర్థి ముక్కా శ్రావణి, వైకాపా అభ్యర్థి వరుదు కల్యాణి ఆస్తుల వివరాలు అఫిడవిట్లలో వెల్లడయ్యాయి.
ముక్కా శ్రావణి కుటుంబ ఆస్తులు
కూటమి అభ్యర్థి ముక్కా శ్రావణి ఫిజియోథెరపీ కోర్సు చేశారు. తనతో పాటు తల్లి ఈశ్వరి, తండ్రి ముత్యాలనాయుడు పేర్లపై ఉన్న ఆస్తుల్లో 23 తులాల బంగారం ఉన్నట్లు పేర్కొన్నారు. చేతిలో రూ.6.50 లక్షల నగదు ఉన్నట్లు, బ్యాంకు రుణం రూ.4 లక్షల వరకు ఉన్నట్లు వెల్లడించారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని అఫిడవిట్‌లో తెలిపారు. ఆమె ఆస్తుల విలువను రూ.1.78 కోట్లుగా పేర్కొన్నారు.
వరుదు కల్యాణి ఆస్తులు, అప్పులు
వైకాపా అభ్యర్థి వరుదు కల్యాణి తన కుటుంబ ఆస్తుల విలువ రూ.12.89 కోట్లుగా, అప్పులు రూ.3.41 కోట్లుగా వెల్లడించారు. ఆమె భర్త గేదెల లక్ష్మణ సురేష్ వ్యాపార రంగంలో ఉన్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి కల్యాణి ఆదాయం రూ.15.95 లక్షలుగా, ఆమె భర్త ఆదాయం రూ.51.77 లక్షలుగా ఆదాయపు పన్ను నివేదికల్లో పేర్కొన్నారు.
కల్యాణి పేరుపై 30.98 ఎకరాల వ్యవసాయ భూమి, భర్త పేరుపై 4.97 ఎకరాలు, వారసత్వంగా వచ్చిన మరో 20.11 ఎకరాల భూమి ఉన్నాయి. మధురవాడ, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఆమె పేరుపై 8,615.2 చదరపు అడుగుల స్థలాలు, భర్త పేరుపై 5,764.34 చదరపు అడుగుల స్థలాలు ఉన్నాయి. వీటితో పాటు 2,156 చదరపు అడుగుల వాణిజ్య స్థలం ఇద్దరి పేర్లపై ఉన్నట్లు వెల్లడించారు.
కల్యాణి తనపై విశాఖపట్నం అదనపు జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో కొన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు, అనంతపురం నాలుగో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మరో కేసు విచారణ దశలో ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
ఇతర విశాఖ మేయర్ అభ్యర్థుల ఆస్తులు
* కరణం కీర్తన గ్రేస్ (బీఎస్‌పీ): రూ.1.65 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు.
* నమ్మి భవానీ (బీఎస్‌వై పార్టీ): తన పేరుపై రూ.1.28 కోట్లు, భర్త పేరుపై రూ.87.50 లక్షల ఆస్తులు ఉన్నట్లు వెల్లడించారు.
* దేవర నాగసునంద దేవి (కాంగ్రెస్): బ్యాంకు ఖాతాలో రూ.10 వేల నిల్వ మాత్రమే ఉన్నట్లు, స్థిరాస్తులు, చరాస్తులు, బంగారం, వాహనాలు లేవని పేర్కొన్నారు.
* శైలజా తులసి (స్వతంత్ర): తన వద్ద రూ.3 వేల నగదు, పిల్లల వద్ద రూ.4 లక్షలు ఉన్నట్లు తెలిపారు.
* దండి ప్రియాంక (స్వతంత్ర): స్థిరాస్తులు లేవని, రూ.50 వేల నగదు, పది తులాల బంగారం ఉన్నట్లు వెల్లడించారు.
* వియ్యపు ఉమ (స్వతంత్ర): బ్యాంకు ఖాతాలో రూ.46 వేలు, 50 గ్రాముల బంగారం, చేతిలో రూ.10 వేల నగదు ఉన్నట్లు పేర్కొన్నారు.
తిరుపతి: జేబీ శ్రీనివాస్ కుటుంబ ఆస్తులు రూ.11.13 కోట్లు
తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి మన్నెం శ్రీనివాసప్రసాద్ (జేబీ శ్రీనివాస్), వైకాపా అభ్యర్థి వై. వాసుదేవ యాదవ్ తమ ఆస్తులు, అప్పులు, కేసుల వివరాలను అఫిడవిట్లలో వెల్లడించారు.
జేబీ శ్రీనివాస్ స్థిర, చరాస్తులు:
తెదేపా అభ్యర్థి జేబీ శ్రీనివాస్ కుటుంబానికి సుమారు రూ.11.13 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. ఇందులో ఆయన పేరుపై రూ.1.94 కోట్ల చరాస్తులు, భార్య రాజ్యలక్ష్మి పేరుపై రూ.1.12 కోట్ల చరాస్తులు, పిల్లల పేర్లపై రూ.24 వేల చరాస్తులు ఉన్నాయి. మొత్తం చరాస్తుల విలువ సుమారు రూ.3.07 కోట్లు.
శ్రీనివాస్ పేరుపై రూ.8.05 కోట్ల స్థిరాస్తులు ఉండగా, భార్య పేరుపై స్థిరాస్తులు లేవని వెల్లడించారు. ఆయన వద్ద రూ.20 లక్షల నగదు, భార్య వద్ద రూ.10 లక్షల నగదు ఉన్నాయి. వివిధ బ్యాంకు ఖాతాలు, వ్యాపార సంస్థల్లో కలిపి సుమారు రూ.1.30 కోట్ల డిపాజిట్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
వాహనాల విషయానికి వస్తే.. శ్రీనివాస్ పేరుపై రూ.9 లక్షల విలువైన అశోక్ లేలాండ్ వాహనం ఉంది. భార్య పేరుపై రూ.17 లక్షల విలువైన మహీంద్రా థార్ రాక్స్, సుజుకి యాక్సెస్ ద్విచక్ర వాహనం ఉన్నాయి. ఇద్దరి వద్ద కలిపి 770 గ్రాముల బంగారు ఆభరణాలు ఉన్నట్లు, వాటి విలువ సుమారు కోటి రూపాయలని వెల్లడించారు.
తిరుపతి రూరల్ పరిధిలో 5.05 ఎకరాల వ్యవసాయ భూమి, తిరుచానూరులో వ్యవసాయేతర భూమి, కేఆర్ నగర్‌లో వాణిజ్య, నివాస స్థలాలు ఉన్నాయి. కేఆర్ నగర్‌లో వాణిజ్య స్థలం విలువ రూ.4.16 కోట్లు, నివాస స్థలాల విలువ రూ.2.47 కోట్లుగా పేర్కొన్నారు. ‘జేబీ ఎన్‌క్లేవ్’లోని 12 ఫ్లాట్లలోనూ హక్కులు ఉన్నట్లు వెల్లడించారు.
కుటుంబంపై బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు కలిపి రూ.2.51 కోట్ల అప్పులు ఉన్నాయి. శ్రీనివాస్‌పై మూడు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆయన బీకాం పూర్తి చేశారు.
వై. వాసుదేవ యాదవ్‌కు స్థిరాస్తులు లేవు
వైకాపా అభ్యర్థి వాసుదేవ యాదవ్ పేరుపై స్థిరాస్తులు లేవని అఫిడవిట్‌లో వెల్లడించారు. ఆయన వద్ద రూ.2 లక్షల నగదు, రూ.55 వేల బ్యాంకు డిపాజిట్లు, రెండు ద్విచక్ర వాహనాలు, 25 గ్రాముల బంగారం ఉన్నాయి. వీటి మొత్తం విలువ సుమారు రూ.11.43 లక్షలు.
ఆయన భార్య ఎన్. వినీల ప్రభుత్వ వైద్యురాలిగా పనిచేస్తున్నారు. ఆమె పేరుపై రూ.50 వేల నగదు, రూ.12 లక్షల విలువైన కారు, 50 గ్రాముల బంగారం ఉన్నాయి. మొత్తం చరాస్తుల విలువ సుమారు రూ.19.66 లక్షలుగా పేర్కొన్నారు.
వాసుదేవ యాదవ్‌కు వ్యక్తిగతంగా అప్పులు లేవు. అయితే, ఆయన భార్య పేరుపై బజాజ్ ఫైనాన్స్‌లో రూ.30 లక్షల ఓవర్‌డ్రాఫ్ట్, రూ.7.22 లక్షల కారు రుణం ఉన్నాయి.
వాసుదేవ యాదవ్‌పై అలిపిరి, ఎస్వీయూ క్యాంపస్, తిరుచానూరు, ఈస్ట్ తదితర పోలీస్‌స్టేషన్ల పరిధిలో 18కి పైగా క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆస్తుల ధ్వంసం, అక్రమంగా గుమికూడటం, విధులకు ఆటంకం కలిగించడం వంటి అభియోగాలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు వెల్లడించారు. ఆయన 2013లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బీపీటీ) పూర్తి చేశారు.
విజయవాడ: ఏబీ వెంకటేశ్వరరావు కుటుంబానికి రూ.21.55 కోట్ల ఆస్తులు
విజయవాడ మేయర్ పదవికి పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ, వైకాపా అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి, స్వతంత్ర అభ్యర్థి, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఎ.బి. వెంకటేశ్వరరావు తమ కుటుంబాల ఆస్తుల వివరాలను అఫిడవిట్లలో వెల్లడించారు.
వంగవీటి రాధాకృష్ణ ఆస్తులు:
కూటమి అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ పేరుపై రూ.1.69 లక్షల చరాస్తులు, రూ.1.88 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఆయన భార్య పుష్పవల్లి పేరుపై రూ.52.36 లక్షల చరాస్తులు, రూ.76 లక్షల స్థిరాస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. కుమార్తె పేరుపై రూ.10 లక్షల చరాస్తులు ఉన్నాయి.
రాధాకృష్ణ కుటుంబానికి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ.40 లక్షల హోమ్‌లోన్ ఉంది. గత ఏడాది రాధాకృష్ణ ఆదాయం రూ.3.78 లక్షలుగా, ఆయన భార్య ఆదాయం రూ.45.65 లక్షలుగా వెల్లడించారు. రాధాకృష్ణ పేరుపై వాహనాలు లేవని, భార్య పేరుపై ఇన్నోవా క్రిస్టా కారు ఉందని పేర్కొన్నారు. ఆయనపై ఎలాంటి కేసులు లేవని అఫిడవిట్‌లో తెలిపారు.
రాయన భాగ్యలక్ష్మి కుటుంబ ఆస్తులు:
వైకాపా అభ్యర్థి రాయన భాగ్యలక్ష్మి పేరుపై రూ.66.50 లక్షల చరాస్తులు, రూ.2.63 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. ఆమె భర్త నరేంద్ర పేరుపై రూ.67 లక్షల చరాస్తులు, రూ.1.99 కోట్ల స్థిరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. ఇద్దరు పిల్లల పేర్లపై రూ.28 లక్షల చరాస్తులు ఉన్నాయి. కుటుంబానికి మహీంద్రా థార్, ఫార్చ్యూనర్ లెజెండర్ కార్లు ఉన్నట్లు పేర్కొన్నారు.
కుటుంబంపై మొత్తం రూ.50 లక్షల బ్యాంకు రుణాలు, ఇతర అప్పులు ఉన్నట్లు అఫిడవిట్‌లో చూపించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి భాగ్యలక్ష్మి ఆదాయం రూ.13.50 లక్షలు, నరేంద్రకుమార్ ఆదాయం రూ.14.15 లక్షలుగా పేర్కొన్నారు. వారి పిల్లలు హృజని ఆదాయం రూ.10.94 లక్షలు, యుక్తిక ఆదాయం రూ.8.40 లక్షలుగా వెల్లడించారు.
భాగ్యలక్ష్మిపై మూడు కేసులు నమోదైనట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అనుమతి లేకుండా ఆందోళనల్లో పాల్గొనడం, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించడం వంటి అంశాలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు వెల్లడించారు.
ఏబీ వెంకటేశ్వరరావు ఆస్తుల వివరాలు:
స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న విశ్రాంత ఐపీఎస్ అధికారి ఎ.బి. వెంకటేశ్వరరావు కుటుంబానికి మొత్తం రూ.21.55 కోట్ల ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు.
* వెంకటేశ్వరరావు పేరుపై రూ.1.76 కోట్ల చరాస్తులు ఉన్నాయి.
* ఆయన భార్య పేరుపై రూ.1.06 కోట్ల చరాస్తులు ఉన్నాయి.
* వెంకటేశ్వరరావు పేరుపై రూ.కోటి విలువైన స్థిరాస్తులు ఉన్నాయి.
* ఆయన భార్య పేరుపై రూ.18.73 కోట్ల స్థిరాస్తులు ఉన్నాయి.
తమకు ఎలాంటి రుణాలు లేవని, సొంత వాహనాలు కూడా లేవని అఫిడవిట్‌లో వెల్లడించారు.
నెల్లూరు: రూప్‌కుమార్ యాదవ్ అప్పులు రూ.6.87 కోట్లు
నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పదవికి తెదేపా తరఫున పోలుబోయిన రూప్‌కుమార్ యాదవ్, వైకాపా తరఫున ఆనం విజయకుమార్‌రెడ్డి పోటీలో ఉన్నారు. ఇద్దరూ తమ ఆస్తులు, అప్పులు, విద్యార్హతలు, కేసుల వివరాలను ఎన్నికల అఫిడవిట్లలో పేర్కొన్నారు.
తెదేపా అభ్యర్థి రూప్‌కుమార్ యాదవ్
రూప్‌కుమార్ యాదవ్ వయసు 51 సంవత్సరాలు. ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. తన కుటుంబ ఆస్తుల విలువ రూ.6.20 కోట్లుగా, అప్పులు రూ.6.87 కోట్లుగా వెల్లడించారు. ఆయనపై రెండు కేసులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
ఆయనకు ఆరు బ్యాంకు ఖాతాలు ఉండగా, వాటిలో కలిపి రూ.10,04,279 ఉంది. చేతిలో రూ.5,01,200 నగదు ఉన్నట్లు తెలిపారు. షేర్లలో పెట్టుబడులతో పాటు రూ.10 లక్షల విలువైన పాలసీ, రూ.1.73 లక్షల ఎల్‌ఐసీ పాలసీ ఉన్నాయి. వివిధ కంపెనీల్లో రూ.52.58 లక్షలు పెట్టుబడి పెట్టినట్లు పేర్కొన్నారు.
ఆయన పేరుపై రెండు కార్లు ఉన్నాయి. వాటిలో ఒకటి రూ.15 లక్షలు, మరొకటి రూ.18 లక్షల విలువైనవిగా చూపించారు. 100 గ్రాముల బంగారం ఉన్నట్లు వెల్లడించారు. మొత్తం చరాస్తుల విలువ రూ.4.05 కోట్లుగా పేర్కొన్నారు.
సైదాపురం మండలంలో 37.3 ఎకరాల వ్యవసాయేతర భూమి, పడుగుపాడులో 255.68 చదరపు అడుగుల స్థలం ఉన్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు.
వైకాపా అభ్యర్థి ఆనం విజయకుమార్‌రెడ్డి
ఆనం విజయకుమార్‌రెడ్డి వయసు 71 సంవత్సరాలు. ఎంకామ్ పూర్తి చేశారు. తన ఆస్తుల విలువ రూ.3.73 కోట్లుగా వెల్లడించారు. ఆయనపై నాలుగు కేసులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ధర్నాలు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం వంటి అభియోగాలకు సంబంధించిన కేసులు ఉన్నట్లు వివరించారు.
ఆనం వద్ద రూ.25 వేల నగదు, ఆయన భార్య వద్ద రూ.20 వేల నగదు ఉన్నాయి. ఆయనకు వివిధ బ్యాంకుల్లో ఐదు ఖాతాలు ఉండగా, వాటిలో కలిపి రూ.47.48 లక్షల నిల్వ ఉంది. భార్య బ్యాంకు ఖాతాలో రూ.10,828 ఉన్నట్లు పేర్కొన్నారు.
ఆనం పేరుపై రూ.22 లక్షలు, రూ.15 లక్షల విలువైన రెండు కార్లు ఉన్నాయి. ఆయన వద్ద 40 గ్రాముల బంగారం, భార్య వద్ద 160 గ్రాముల బంగారం ఉన్నాయి. ఆయన చరాస్తుల విలువ రూ.90,17,598.81 కాగా, భార్య చరాస్తుల విలువ రూ.22,06,828గా వెల్లడించారు.
రెండు వాహనాలను రుణంతో కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. ఒక వాహనానికి సంబంధించి రూ.15,45,058, టయోటా ఫైనాన్స్‌కు రూ.71,401 బకాయి ఉన్నట్లు తెలిపారు. మొత్తం అప్పులు రూ.16,16,459గా వెల్లడించారు. 37 అంకణాల స్థలంతో పాటు సర్వే నంబరు 186లో అపార్ట్‌మెంట్, ఇల్లు, స్థలం కలిపి రూ.2.21 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.


