Railway: రన్నింగ్ ట్రైన్లో బ్లింకిట్ సేవలు.. ఎలా ఆర్డర్ చేసుకోవాలంటే.?
Railway: రైలు ప్రయాణంలో అవసరమైన వస్తువులు తీసుకెళ్లడం మర్చిపోయారా? ఫోన్ ఛార్జర్, మందులు, వ్యక్తిగత అవసరాలకు సంబంధించిన వస్తువులు కావాలన్నా ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింకింట్ ఈ సేవలను అందిస్తోంది.

రైలు ప్రయాణికులకు కొత్త సదుపాయం
ప్రస్తుతం రైలు ప్రయాణంలో ఆకలేస్తే స్విగ్గీ, జొమాటో వంటి యాప్‌ల ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేసుకునే సదుపాయం ఉంది. ప్రయాణికులు ముందుగానే ఆర్డర్ చేస్తే, నిర్ణీత రైల్వే స్టేషన్లో ఆహారాన్ని అందుకోవచ్చు. ఇప్పుడు ఇదే తరహాలో అత్యవసర వస్తువులను కూడా పొందే అవకాశం కల్పిస్తున్నారు. ప్రయాణంలో ఫోన్ ఛార్జర్ మర్చిపోయినా, వ్యక్తిగత అవసరాలకు సంబంధించిన వస్తువులు కావాలన్నా బ్లింకిట్ యాప్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు. అయితే ఈ సేవ అన్ని రైల్వే స్టేషన్లలో అందుబాటులో లేదు. కాబట్టి ఆర్డర్ చేసే ముందు మీకు అవసరమైన స్టేషన్లో ఈ సదుపాయం ఉందో లేదో తెలుసుకోవాలి.
బ్లింకింట్ చేతులు కలిపిన దక్షిణ రైల్వే
దక్షిణ రైల్వేలోని సేలం డివిజన్ క్విక్ కామర్స్ సంస్థ బ్లింకిట్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ భాగస్వామ్యం ద్వారా రైలు ప్రయాణికులకు అవసరమైన వస్తువులను అందించేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈ సేవను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ విధానం విజయవంతమైతే భవిష్యత్తులో మరిన్ని ప్రధాన రైల్వే స్టేషన్లకు విస్తరించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం అన్ని ప్రాంతాల్లోనూ ఈ సదుపాయం అందుబాటులోకి రాలేదు.
ఏయే వస్తువులను ఆర్డర్ చేసుకోవచ్చు?
బ్లింకిట్ ద్వారా ప్రయాణికులు తమ అవసరాలకు అనుగుణంగా పలు రకాల వస్తువులను ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంటుంది. వాటిలో ముఖ్యమైనవి అవసరమైన మందులు, ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన వస్తువులు. మొబైల్ ఛార్జర్లు: ఫోన్ ఛార్జింగ్ కోసం అవసరమైన ఛార్జర్లు, ఇతర అనుబంధ వస్తువులు. వ్యక్తిగత సంరక్షణ వస్తువులు: పరిశుభ్రతకు సంబంధించిన ఉత్పత్తులు. ఆహార పదార్థాలు: తినుబండారాలు, ఇతర ఆహార వస్తువులు. పిల్లలకు అవసరమైన వస్తువులు: చిన్నారుల సంరక్షణకు ఉపయోగపడే ఉత్పత్తులు. అయితే ఏయే వస్తువులు అందుబాటులో ఉంటాయనేది సంబంధిత స్టేషన్‌లోని స్టాక్‌పై ఆధారపడి ఉంటుంది. అలాగే మందులు సహా కొన్ని వస్తువుల లభ్యతకు ప్రత్యేక పరిమితులు ఉండవచ్చు.
బ్లింకిట్ ద్వారా వస్తువులను ఎలా ఆర్డర్ చేయాలి?
రైలు ప్రయాణంలో అవసరమైన వస్తువులను ఆర్డర్ చేసుకోవడానికి సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు.
* ముందుగా మీ ఫోన్లో Blinkit యాప్‌ను ఓపెన్ చేయాలి.
* మీరు వస్తువులను తీసుకోవాలనుకుంటున్న రైల్వే స్టేషన్ ప్రాంతాన్ని లొకేషన్‌గా ఎంచుకోవాలి.
* అందుబాటులో ఉన్న వస్తువుల్లో మీకు కావాల్సిన వాటిని ఎంపిక చేసి కార్ట్‌లో చేర్చాలి.
* యాప్‌లో అడిగితే రైలు నంబర్, కోచ్ లేదా బెర్త్ వివరాలను నమోదు చేయాలి.
* ఆర్డర్‌ను నిర్ధారించి, డెలివరీకి సంబంధించిన సూచనలను పరిశీలించాలి.
* రైలు సంబంధిత స్టేషన్‌కు చేరుకున్నప్పుడు, యాప్‌లో సూచించిన నిర్ణీత డెలివరీ పాయింట్ నుంచి వస్తువులను తీసుకోవాలి.
ఆర్డర్ చేసే ముందు ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి
ఆర్డర్ చేసే ముందు స్టేషన్ లొకేషన్, వస్తువుల లభ్యత, డెలివరీ సమయం వంటి వివరాలను తప్పనిసరిగా తనిఖీ చేయాలి. రైలు ఆగే సమయానికి అనుగుణంగా వస్తువులను అందుకోవడం సాధ్యమవుతుందో లేదో కూడా నిర్ధారించుకోవాలి. ఈ సేవ ప్రస్తుతం ఎంపిక చేసిన స్టేషన్లకే పరిమితమై ఉన్నందున, అన్ని రైళ్లలో లేదా అన్ని స్టేషన్లలో డెలివరీ లభిస్తుందని భావించకూడదు.








