20 మంది మహిళల ఆత్మహత్యా యత్నం...

20 మంది మహిళల ఆత్మహత్యా యత్నం...

తమ ఊరిలో మద్యం షాపు తొలగించాలంటూ మహిళలు ఎంత సాహసం చేశారో. రాష్ట్రంలోనే ఇంత వరకూ ఇటువంటి సంఘటన జరగలేదు. దాంతో మహిళలు చేసిన పని సంచలనంగా మారింది. ఇంతకీ జరిగిన విషయం ఏంటంటే, పశ్చిమగోదావరి జిల్లాలో ఫతేపురం అనే గ్రామముంది. అందులో ఓ మద్యం షాపుంది. దాన్ని ఊరినుండి ఎత్తేయాలంటూ గ్రామంలోని మహిళలు చాలా కాలంగా ఆందోళన చేస్తున్నారు. అయితే, వీరి ఆందోళనను అధికారులెవరూ పట్టించుకోలేదు. చివరకు చేసేదిలేక మంగళవారం నాడు షాపు ఎదుటే సుమారు 500 మంది ధర్నాకు దిగారు.

దాంతో పరిస్ధితి విషమిస్తోందని అర్ధం చేసుకున్న గ్రామపెద్దలు కొందరు జోక్యం చేసుకున్నారు. వేలం పాడుకున్న షాపును తొలగించటం సాధ్యం కాదని స్పష్టం చేశారు. దాంతో మహిళల్లో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. అంతే, అక్కడి నుండి ఒక్కసారిగా పైకి లేచి పరుగు మొదలుపెట్టారు. ఆందోళన చేస్తున్న స్ధలానికి సమీపానే ఉన్న ఓ చేపల చెరువులోకి దూకి 20 మంది సామూహిక ఆత్మహత్యకు ప్రయత్నించారు. దాంతో ఆ విషయం సంచలనంగా మారింది.

ఎప్పుడైతే విషయం బయటకు పొక్కిందో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మహిళలు కూడా అక్కడకి రావటం మొదలుపెట్టారు. పరిస్ధితి చేయి దాటిపోతోందని గ్రహించిన గ్రామపెద్దలు వెంటనే పోలీసులను పిలిపించారు. మరి కొందరు చెరులోకి దూకి మహిళను రక్షించారు. అయితే, అది చేపల చెరువు కావటంతో పాటు దూకిన వాళ్ళలో ఎక్కువమందికి ఈత రాకపోవటంతో ముణిగిపోయారు. మొత్తానికి అందరినీ స్ధానికులు రక్షించారనుకోండి. కాకపోతే ముణిగిపోయేటపుడు నీళ్ళు మింగేసిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. వెంటనే వైద్యం కోసం విజయవాడకు తరలించారు. పోలీసులు జోక్యం చేసుకుని షాపు యజమానితో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యే వరకూ షాపు తెరవద్దని చెప్పారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos